ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
అమరావతి, హైదరాబాద్, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నేడు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, మనయం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీస్థాయిలో వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ద్రోణి కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, ఖమ్మం, సిద్దిపేట, వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది.
మరోవైపు, హైదరాబాద్‌లో ప్రస్తుతం వాతావరణం మేఘావృతమై ఉంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత, సాయంత్రానికి హైదరాబాద్ వ్యాప్తంగా జోరుగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోల్స్ తెరవకూడదని, ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్షం కారణంగా.. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.