మహారాష్ట్రలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన మహాయుతి కూటమిలో సీఎం ఎవరు అన్నదానిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ కు అవకాశం కల్పించాలని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తున్నప్పటికీ.. కూటమిలోని కీలక పక్షమైన శివసేన దీనికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో సీఎం పేరు ఖరారులో తీవ్ర జాప్యం జరుగుతోంది.
దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ షిండే
మహారాష్ట్రలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన మహాయుతి కూటమిలో సీఎం ఎవరు అన్నదానిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ కు అవకాశం కల్పించాలని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తున్నప్పటికీ.. కూటమిలోని కీలక పక్షమైన శివసేన దీనికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో సీఎం పేరు ఖరారులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను కొలిక్కి తీసుకువచ్చేందుకు బిజెపి అగ్రనాయకత్వం దృష్టిసారించింది. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానిలను మహారాష్ట్ర పరిశీలకులుగా నియమించింది. వీరిలో రూపాని మంగళవారం ముంబై చేరుకోనున్నారు. నాలుగో తేదీన నిర్మల సీతారామన్ ముంబై చేరుకుంటారు. ఈనెల నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు ముంబైలోని విధాన సభ సెంట్రల్ హాల్లో బిజెపి శాసనసభ పక్ష నేత ఎన్నిక జరగనుంది. ఫడ్నవీస్ ను బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయననే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఆయనకే ఉన్నట్లు సమాచారం. ఈనెల 5వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ముంబై ఆజాద్ మైదానంలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది.
అనారోగ్యంతో బాధపడుతున్న మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కు దేవేంద్ర ఫడ్నవీస్ ఫోన్ చేశారు. ఆరోగ్య వివరాలను తెలుసుకోవడమే కాకుండా తన సన్నిహితుడైన గిరీష్ మహాజన్ ను షిండే దగ్గరకు పంపించారు. అంతకుముందు అనారోగ్యం కారణంగా షిండే మహాయుతి నేతల సమావేశంతో పాటు మిగతా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. వాస్తవానికి షిండే డిప్యూటీ సీఎం పదవితోపాటు హోం శాఖ కూడా ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. హోం మంత్రిత్వ శాఖ తనకు కేటాయిస్తే సీఎం పదవి లేకపోయినా తన ప్రతిష్ట తగ్గదని, ఒకవేళ తాను కోరిన మంత్రిత్వ శాఖలు ఇవ్వకపోతే ప్రతిపక్ష నేతగా అయినా కొనసాగుతానంటూ షిండే బిజెపి అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. మరోవైపు డిప్యూటీ సీఎంగా షిండే తనయుడు శ్రీకాంత్ ను నిలబెట్టాలని ప్రతిపాదన బయటకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిని శ్రీకాంత్ కొట్టి పారేశారు. తాను ఎటువంటి రేసులో లేనంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా తో ఎన్సిపి అధ్యక్షుడు అజిత్ పవార్, ఇతర ఎన్సిపి నేతలు సమావేశం అయ్యారు. కొత్త ప్రభుత్వంలో చేపట్ట పోయే మంత్రిత్వ శాఖల కేటాయింపులపై చర్చించారు ఇప్పటికే జరిగిన చర్చల ప్రకారం బిజెపికి 20, శివసేనకు 12, ఎన్సీపీకి పది మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది. ఈ నెల 5వ తేదీన కూటమి తరఫున కనీసం 20 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని సమాచారం.
షిండే డిమాండ్లకు బిజెపి అగ్రనాయకత్వం తలొగ్గుతుందా.!
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే డిమాండ్లకు బిజెపి అగ్రనాయకత్వం తలొగ్గుతుందా.? లేదా అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ముంబై దేశ ఆర్థిక రాజధాని కావడంతోపాటు రాష్ట్ర రాజధాని. ఇటువంటి కీలక రాష్ట్రంలో హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ శాఖకు పవర్ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పదవి లేకపోయినా తనకు హోం మంత్రిత్వ శాఖ ఇవ్వాలంటూ షిండే డిమాండ్ చేస్తున్నారు. కానీ బిజెపి ఈ శాఖను కట్టబెట్టే విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తనకు ఆ మంత్రిత్వ శాఖ ఇవ్వకపోతే మాత్రం బిజెపితో కలిసి ముందుకు వెళ్లే ఆలోచనను షిండే చేయకపోవచ్చునే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి షిండే కు ఆ శాఖలను కట్టబెడుతుందా.? లేకపోతే మరో విధంగా ఆయనను మెత్త పెడతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం జరగనున్న సమావేశానికి ముందే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. షిండే మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను ఒక మెట్టు దిగేందుకు అంగీకరిస్తున్నానంటే దానికి కూటమి ధర్మానికి కట్టుబడి ఉండడమేనని చెబుతున్నారు. ఇంతకంటే తనను మరింత కిందకు దించాలని భావిస్తే మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తన సన్నిహితులు వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో బిజెపి అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.