TGSRTC | వేములవాడ- ముంబై లహరి స్లీపర్ బస్సు ప్రారంభం.. ప్రయాణ వేళలు, చార్జీల వివరాలివీ..

ప్రజల కోరిక మేరకు ముంబైకి లహరి స్లీపర్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

lahari bus worli
వేములవాడ నుంచి ముంబై-వర్లీకి లహరి బస్సు

ప్రజల కోరిక మేరకు ముంబైకి లహరి స్లీపర్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం వేములవాడ చెరువు కట్ట గుడి ప్రాంగణం వద్ద రెండు ఏసీ బస్సులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పూజ చేసి, జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ప్రజల కోరిక మేరకు వేములవాడ నుండి ముంబై వెళ్లేందుకు ఏసీ స్లీపర్ లహరి బస్సు సర్వీసులను ప్రారంభించామని అన్నారు.  2 లహరి సర్వీస్ ఏసీ బస్సులను ముంబై సర్వీస్ నిమిత్తం కేటాయించామని వివరించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి తెల్లవారుజామున ఉదయం 4.45 గంటలకు ముంబైకి చేరుకుంటుందని, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వేములవాడ చేరుకుంటుందని వెల్లడించారు. ప్రతిరోజు ముంబైకి అప్ అండ్ డౌన్ సర్వీస్ నడుస్తుందని చెప్పారు. లహరి బస్సు సర్వీస్ లో 22 సీట్లు, 20 స్లీపర్ బెర్తులు ఉన్నాయని, ప్రతి సీటుకు చార్జింగ్ పాయింట్, ఏసీ అడ్జెస్ట్మెంట్ సౌకర్యం ఉందని, వైఫై సౌకర్యం కూడా కల్పించామని అన్నారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వేములవాడ నుంచి ముంబైకి పెద్దలకు స్లీపర్ బెర్తుకు రూ.2 వేలు, సీటు రూ.1,500, పిల్లలకు బెర్త్ రూ.1,600, సీటుకు రూ.1,230 ధర ఉందని తెలిపారు.

అంతకుముందు మంత్రి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రాజన్న స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు ప్రారంభించిన అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వరకు అదే బస్సులో ప్రయాణించి.. ముంబై వెళ్లే ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బీ గీతే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్