జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మండల సమాఖ్యలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. మండల సమాఖ్యకు చెందిన ఏపీఎం, సీసీ కలిసి ఓ గ్రామ సంఘం విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అవగతం అవుతోంది.
- బల్వంతాపూర్ వీవోలో బండారం బట్టబయలు
- గ్రామ సంఘం తీర్మానం లేకుండానే డేటా ఎంట్రీ
- సంఘ అధ్యక్షురాలిగా మాజీ ఎంపీపీ నియామకం
- తప్పు బయటపడటంతో మాజీ ఎంపీపీ పేరు మార్పు
- తప్పులను కప్పిపుచ్చేందుకు వీవోఏను బలి చేసే కుట్ర
అధికార మత్తులో చేసిన
తప్పులను ఒప్పులుగా మార్చే కుట్రలు..
ఆ తప్పును కప్పి పుచ్చేందుకు
కిందిస్థాయివారిని బలి చేసే కుతంత్రాలు..
తప్పు నెత్తి మీదికి వస్తుందంటే
కింది ఉద్యోగిపై నెట్టేసే పన్నాగాలు..
తప్పు చేసేది ఒకరు.. శిక్ష పడేది మరొకరికా?
మల్యాల, ఈవార్తలు: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మండల సమాఖ్యలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. మండల సమాఖ్యకు చెందిన ఏపీఎం, సీసీ కలిసి ఓ గ్రామ సంఘం విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అవగతం అవుతోంది. అధికారం ఉందన్న మత్తులో తప్పుల మీద తప్పులు చేసినట్లు అర్థం అవుతోంది. పూర్తి వివరాల్లోకెళితే.. మల్యాల మండలంలోని బల్వంతాపూర్ గ్రామంలో ఉన్న శ్రీరాజరాజేశ్వరి గ్రామైక్య సంఘంలో 31 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ ఎలాంటి రిమార్కు లేకుండా అద్భుతంగా నడుస్తున్నాయి. సంఘ సభ్యులు పొదుపులు చేసుకోవడం, లోన్లు తీసుకోవడం, సకాలంలో చెల్లించడంతో ఆ గ్రామైక్య సంఘం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇదంతా సాఫీగానే ఉన్నా.. ఏపీఎం చిన్న రాజయ్య, సీసీ కృష్ణమోహన్ చేసిన ఓ పనితో ఈ గ్రామైక్య సంఘంలో అసలు వివాదం మొదలైంది. వాళ్లు తమ అధికారాన్ని వాడి, తమంతట తాముగానే ఒక కొత్త సంఘాన్ని ఆన్‌లైన్ చేశారు. వాస్తవానికి గ్రామైక్య సంఘం తీర్మానం లేకుండా ఏ సంఘాన్ని కూడా ఆన్‌లైన్ చేయరాదనేది నిబంధన. కానీ, ఏపీఎం, సీసీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ సంఘం ఆన్‌లైన్ చేయడం వెనుక బలమైన కారణం ఉన్నదన్న వాదన వినిపిస్తోంది. ఆ కొత్త సంఘంలో అధ్యక్షురాలిగా మాజీ ఎంపీపీ తైదల శ్రీలతను చేర్చారు. ఆమె మాజీ ప్రజాప్రతినిధి. ఆమె భర్త రాజయ్య కూడా సారంగపూర్ మండలానికి ఏపీఎంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కోరిక మేరకే ఆన్‌లైన్‌లో కొత్త సంఘాన్ని చేర్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆన్‌లైన్ డేటా చేయడం తప్పు అని తెలుసుకొని, సంఘ అధ్యక్షురాలిగా శ్రీలత పేరును తొలగించి, వేరొకరి పేరును చేర్చారు. బ్యాంకు ఖాతాలోనూ పేరు మార్చారు. ఆన్‌లైన్ డేటా విషయం ఎక్కడ బయట పొక్కుతుందోనని.. గ్రామైక్య సంఘ వీవోఏ బొమ్మకంటి శ్యామలను బలి చేసేందుకు కుట్ర చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. తాము డేటా ఆన్‌లైన్ చేసినందున కచ్చితంగా ఆ సంఘానికి పొదుపు తీసుకోవాలని ఆమెపై ఏపీఎం, సీసీ ఒత్తిడి తెచ్చారు. అయితే, పై అధికారుల అధికార దుర్వినియోగానికి తాను బలి కాబోనని ఆమె స్పష్టంచేశారు. గ్రామైక్య సంఘం తీర్మానం ఉంటే పొదుపులు వసూలు చేయడానికి, రసీదు ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. తనకు జారీ చేసిన మెమోలోనూ ఆమె ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గ్రామ సంఘ తీర్మానంలోనూ వివరణ ఇచ్చారు.
పైఅధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి
ఈ అంశం పెద్దదైతే తమ ఉద్యోగాలు పోతాయన్న భయంతో ఏపీఎం, సీసీ కలిసి వీవోఏపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. అందుకు జిల్లా స్థాయి అధికారుల సాయం తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో దొంగ ఆన్‌లైన్ డేటా అంశం జిల్లా సమాఖ్య వరకు చేరింది. ఇదే విషయమై జిల్లా స్థాయి అధికారులైన అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్, ఐబీ డేటా అధికారి గ్రామాన్ని సందర్శించి మహిళా సంఘాల సభ్యులు, వీవోఏ నుంచి వివరణ తీసుకున్నారు. అయితే, ఆన్‌లైన్ డేటా అంశంలో వీరు కూడా ఏపీఎం, సీసీకి మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. ఇదే అంశంపై గురువారం జగిత్యాల పీడీ అధికారి కార్యాలయంలో చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా.. గ్రామ సంఘం తీర్మానం లేకుండా ఆన్‌లైన్ డేటా చేయడం తప్పేనని ప్రాజెక్టు అధికారి అన్నట్లు తెలిసింది. దీనిపై మరింత చర్చ జరగకుండా ఏపీడీ, ఐబీ డేటా అధికారి వ్యవహరించారని సమాచారం. ఓ దశలో అసలు గ్రామ సంఘమే లేకుండా చేస్తామని దురుసు వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. మొత్తంగా ఏపీఎం, సీసీల అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చే చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇందులో వీవోఏను బలిచేసి, చేతులు దులుపుకుందామని కుట్ర చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఏపీఎం, సీసీల వ్యవహారంపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసేందుకు బల్వంతాపూర్ గ్రామైక్య సంఘ సభ్యులు సిద్ధమవుతున్నారు. చివరగా, ఈ దొంగ ఆన్‌లైన్ డేటా ఎంట్రీ విషయంలో పెద్ద తలకాయలు తప్పించుకొని, చిన్నవాళ్లను బలి చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
గతంలో మాజీ ఎంపీపీ భర్త అక్రమాలు
మాజీ ఎంపీపీ తైదల శ్రీలత భర్త రాజయ్య ప్రస్తుతం సారంగపూర్ మండల ఏపీఎంగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో పలు అక్రమాలకు పాల్పడ్డారు. ధర్మారం మండలంలోని మండల సమాఖ్యలో అవకతవలకు పాల్పడి సస్పెండ్ కూడా అయ్యారు. మళ్లీ ఉద్యోగంలో చేరి కాటారం మండల ఏపీఎంగా వ్యవహరించారు. అక్కడి నుంచి సారంగపూర్‌కు బదిలీ అయ్యారు. ఈ ఆన్‌లైన్ డేటా ఎంట్రీ వ్యవహారంలో ఈయన హస్తం ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.