తెలంగాణలో రేషన్ కార్డుల జారీకి అర్హతలను క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం వాడకంలో ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో రేషన్ కార్డుల జారీకి అర్హతలను క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం వాడకంలో ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా.. కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలలోపు ఉంటే రేషన్ కార్డు వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2 లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని సబ్ కమిటీ ప్రతిపాదించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కార్డులు ఉన్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే.. ఏ రాష్ట్రంలో కార్డును కొనసాగిస్తారన్నది నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఈ ప్రతిపాదనపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనున్నట్లు సబ్ కమిటీ వెల్లడించింది.
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీ.. గత కొన్ని రోజులుగా వరుస సమీక్షలు నిర్వహించి కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హతలను సిద్ధం చేస్తున్నది. ఈ సబ్ కమిటీ.. ప్రతిపాదనలు క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదించి, అనంతరం.. అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేయనున్నారు. మార్గదర్శకాలను విడుదల చేసి.. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.