డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు.
ప్రధాని మోదీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఈవార్తలు : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ సమస్యలు, హామీలపై రేవంత్ రెడ్డి, ఏపీ సమస్యలు, విభజన హామీలపై చంద్రబాబు.. ప్రధాని మోదీని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గుబ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో సుమారు గంటసేపు భేటీ అయిన సీఎం.. పలు అంశాలపై చర్చించి, వినతిపత్రం సమర్పించారు.
కేంద్రానికి విజ్ఞప్తులు ఇవీ..
- గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించాలి.
- అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్ష్రేతం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులనూ సింగరేణికే కేటాయించాలి.
- హైదరాబాద్‌కు ఐటీఐఆర్ పునరుద్ధరించాలి.
- ప్రతితి ర్రాష్టంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్రం నిర్ణయించినందున.. హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలి. అందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సరిపడా భూమి అందుబాటులో ఉంది.
- రాష్ట్రానికి పీరియాడికల్ ఓవరాయిలింగ్ వర్క్‌షాప్ కాకుండా, కోచ్ ఫ్యాక్టరీయే మంజూరు చేయాలి.
- బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలి.
- ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలి.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద తెలంగాణకు 25 లక్షల ఇండ్లు మంజూరు చేయాలి.
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) కింద కేంద్రం నుంచి ఏటా రూ.450 కోట్ల చొప్పున 2019-20 నుంచి నాలుగేండ్ల కాలానికి రూ.1,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటిని విడుదల చేయాలి.
- ట్రాఫిక్ నియంత్రణకు హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్-నాగ్‌పూర్ రహదారి (ఎన్ హెచ్ -44)పై ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నాం. వీటి నిర్మాణానికి రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. మొత్తంగా 2,450 ఎకరాల భూములు అవసరం అవుతాయి. ప్రత్యామ్నాయంగా రావిర్యాల ప్రాంతంలోని రిసెర్చ్ సెంటర్ ఇమరాత్ (ఆర్‌ఐసీ)కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- హైదరాబాద్ ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చు ఇవ్వడంతోపాటు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలి.
- ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) జాతీయ రహదారిగా గుర్తించాలి.
- తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్యక్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలి.