వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈవార్తలు, వెదర్ న్యూస్: భగభగమండే ఎండ.. కాలు తీసి బయటపెట్టాలంటే భయం.. సరే పోనీ అని వెళ్లినా ఆ ఎండ వేడికి చర్మం కమిలిపోయేంత వేడి.. గంటకోసారి నీళ్లు తాగకపోతే డ్రీహైడ్రేషన్ అయిపోతుందేమోనన్న భయం.. భానుడి ప్రకోపాన్ని ఈ స్థాయిలో ఎప్పుడూ చూడలేదన్నట్లు ఎండలు కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్య మహారాష్ట్రలో కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు.. సముద్ర మట్టానికి సగటు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వివరించింది.
గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మంగళవారం తెలంగాణలో కిందిస్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు వెల్లడించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మొన్నటి వరకు 44.5 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత మంగళవారం 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం. వర్షాల నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని పేర్కొంది.