తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోబోతోందా? పేద విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోందా? అంటే ప్రభుత్వ చర్యలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోబోతోందా? పేద విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోందా? అంటే ప్రభుత్వ చర్యలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 25 శాతం సీట్ల కేటాయింపును ఎలా అమలు చేయాలన్న దానిపై ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. దీనికోసం రెండు, మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. విద్యార్థి చదవే చోట ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన వైపు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఇదే విధానాన్ని కర్ణాటక అమలు చేస్తోంది.
2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలి. కానీ, తెలంగాణ సహా దేశంలోని 6 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. చట్టం అమల్లోకి వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా.. అమలు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెచ్చింది. కోర్టులు కూడా ఆదేశాలు జారీచేశాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ పద్ధతిని అమలుచేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. అంటే.. రాష్ట్రంలో 11,500 ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు ఉచితంగా 25 శాతం సీట్ల కేటాయింపు జరగనుంది. ఒకటో తరగతి నుంచి ఈ సీట్ల కేటాయింపును ప్రారంభించి.. ఏటేటా పెంచుతూ పోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. పదేళ్లలో అన్ని క్లాసులకు దీన్ని వర్తింపజేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అయితే, 25 శాతం ఉచిత సీట్ల విధానాన్ని అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ భారీగా తగ్గే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.