తెలంగాాణలో రుణమాఫీ మార్గదర్శకాలు సిద్ధం అయినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనను ఆధారంగా చేసుకొని యూనిట్ల వారీగా రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా పథకం రచిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
Rythu Runamafi | హైదరాబాద్, ఈవార్తలు : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 15లోపు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్.. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రుణమాఫీ మార్గదర్శకాలు సిద్ధం అయినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనను ఆధారంగా చేసుకొని యూనిట్ల వారీగా రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా పథకం రచిస్తోంది.
ఇందులో భాగంగా.. రైతులు ఎంత రుణం ఉన్నా.. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం రేషన్ కార్డు, వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డేటాను సరిపోల్చనున్నారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత జిల్లాల్లో అధికారులు, బ్యాంకు అధికారులు కలిసి రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనున్నారు. అనంతరం ఆ జాబితాను గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ ద్వారా చర్చించి, ఆమోదం కోసం జిల్లా కలెక్టర్‌కు పంపనున్నారు.
