కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ15,000 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన చేశారు. కానీ, తెలంగాణకు ప్రత్యేకంగా దక్కిందేమీ లేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ15,000 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన చేశారు. కానీ, తెలంగాణకు ప్రత్యేకంగా దక్కిందేమీ లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మండిపడింది. రాష్ట్రం నుంచి రెండు పార్టీలకు చెరో 8 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి తీసుకొచ్చింది సున్నా అని ఎద్దేవా చేసింది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో 8 (బీజేపీ) + 8 (కాంగ్రెస్) = 0 (సున్నా) అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అవును.. నిజమే! రెండు పార్టీలు రాష్ట్రానికేమీ తీసుకురాలేదంటూ పోస్టులు పెడుతున్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ స్పందిస్తూ.. ఏపీకి కేంద్రం ఎన్నో వరాలు ప్రకటించిందని, కానీ తెలంగాణ పేరు ఎత్తడానికి వాళ్లకు మనసు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు దగా చేశారని, అసలు నిర్మల సీతారామన్.. తెలంగాణ పేరే ఎత్తలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించిన కేంద్రం.. తెలంగాణలోని గోదావరి, కృష్ణానదులపై నిర్మించిన ప్రాజెక్టులపై మాత్రం కనికరం చూపలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే న్యాయం చేసినట్లుగా ఉందని విమర్శించారు. విభజన చట్టం ద్వారా తెలంగాణకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇతర నిధులపై మాత్రం రాష్ట్రానికి చెందిన 16 మంది ఎంపీలు అడగాలని డిమాండ్ చేశారు.