కోచింగ్ సెంటర్ల మాఫియా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తుంటే కోచింగ్ సెంటర్ల మాఫియా.. పోటీ పరీక్షలను అడ్డుకోవాలని కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

revanth reddy
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్, ఈవార్తలు : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తుంటే కోచింగ్ సెంటర్ల మాఫియా.. పోటీ పరీక్షలను అడ్డుకోవాలని కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధన దాహానికి అలవాటు పడి కొన్ని కోచింగ్ సెంటర్లు పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్‌లో మాట్లాడుతూ.. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని పేద విద్యార్థులను రెచ్చకొట్టి వారితో ధర్నాలు, దీక్షలు చేయిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని అందుకే విద్యార్థులు, నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని పేద విద్యార్థులతో దీక్షలు, ధర్నాలు చేయించటం కాదని.. దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావు పరీక్షలు వాయిదా వేసే వరకు ఆర్ట్స్ బిల్డింగ్ ముందు దీక్ష చేయాలని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌తో పెట్టుకుంటే గులాబీ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరుతుంటే ప్రజాస్వామ్యం అంటూ పెద్ద మాటలు చెప్తున్న కేటీఆర్, కేసీఆర్‌కు గతంలో.. ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. 

రేవంత్ వ్యాఖ్యలపై నిరుద్యోగుల మండిపాటు

డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు తమ కోసమే వాయిదా వేయాలని కోరుతున్నామని, తమ నిరసనలను కోచింగ్ సెంటర్లకు ఆపాదించటం ఏంటని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మరి బీఆర్ఎస్ సర్కారులో ప్రతి నోటిఫికేషన్‌పై కేసులు వేసి ముందుకు వెళ్లకుండా చేసింది కాంగ్రెస్సే కదా అని ప్రశ్నించారు. మీరే (రేవంత్) స్వయంగా పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారని గుర్తుచేస్తున్నారు. అప్పుడు సోయి ఎటుపోయిందని నిలదీస్తున్నారు. నాడూ నిరాహార దీక్షలు చేసింది పేద విద్యార్థులేనని.. మరి ఆ దీక్షలు చేయించింది మీరేనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

భర్తీ చేయని పోస్టులకు నియామక పత్రాలా?

బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన పోస్టులకు ఎల్బీ స్టేడియంలో సభ పెట్టి అట్టహాసంగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది మీరు (రేవంత్) అని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఆ పత్రాలు కూడా ఇచ్చి నాలుగు నెలలైనా పోస్టింగులు ఏవని నిలదీస్తున్నారు. చాలా టీచర్లు ఉద్యోగాలు వచ్చాయని, ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసి ఇంట్లో కూర్చున్నారని.. వారికి ఇంకెప్పుడు పోస్టింగ్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్న తీరు? అని ఎండగట్టారు. పోస్టింగులు ఇచ్చిన‌వారికి జీతాలైనా ఇస్తున్నారా? అంటే అదీ లేదు అని విమర్శిస్తున్నారు.

తెలంగాణ బద్ధ విరోధికి నివాళులా?

తెలంగాణ ప్రజలను ఏదో ఉద్ధరించినట్లు.. తెలంగాణకు బద్ధ విరోధి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విజయవాడ పోయి నివాళి అర్పించి వచ్చారని సీఎం రేవంత్‌పై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ తీరు ఆరిపోతే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు ఉన్నదని ధ్వజమెత్తారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్