రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పంట రుణమాఫీపై విధివిధానాలు ఇవీ..

రైతుల పంట రుణాలపై తెలంగాణ కేబినెట్ (telangana cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు రైతులు తీసుకున్న రుణాలను (Crop loans) ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది.

crop loans

తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, ఈవార్తలు : రైతుల పంట రుణాలపై తెలంగాణ కేబినెట్ (telangana cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు రైతులు తీసుకున్న రుణాలను (Crop loans) ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది. కేబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  (CM Revanth Reddy) రుణమాఫీ విధివిధినాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయాన్ని పండుగ చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట ఇస్తే మాడమ తిప్పరు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. అన్ని బ్యాంకుల్లో ఉన్న రుణాల వివరాలు సేకరిస్తాం. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఒకసారి రూ.16 వేల కోట్లు, రెండో సారి రూ.12 వేల కోట్లు మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో రెండు సార్లు చేసిన రుణమాఫీ రూ.28 వేల కోట్లు మాత్రమే’ అని వెల్లడించారు. రుణమాఫీని ఏ ప్రాతిపదినక చేస్తామన్నది.. అర్హులు, అనర్హులను మంత్రివర్గం ఆమోదించిందని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

‘ఇచ్చిన మాట ప్రకారం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయి. ఆ మొత్తాన్ని సేకరించి, రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తి కల్పిస్తాం. రైతు రాజ్యంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. గత ప్రభుత్వం రూ.లక్షకే నాలుగు విడతలుగా చేసింది. కానీ, మేం ఏకకాలంలో రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తాం. మా 6 నెలల పరిపాలనలో రెండున్నర నెలలు ఎన్నికల కోడ్ కిందకే పోయింది. ఇప్పుడే పాలన మొదలుపెట్టాం. అయినా, రైతులకు న్యాయం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది’ అని వివరించారు.

రైతు భరోసా గురించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘రైతుభరోసాపై నాలుగు గోడల మధ్య కూర్చొని విధివిధానాలు తీసుకోవటం కాదు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మంత్రివర్గ ఉపసంఘం ద్వారా ముందుకు వెళ్తాం. జూలై 15 లోగా వచ్చే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. రైతుభరోసా భవిష్యత్తు విధివిధానాలను ఖరారు చేస్తాం. మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేస్తుంది. మంత్రివర్గ నిర్ణయాలను, ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. ఏ సమాచారం కావాలన్నా వారిని సంప్రదించాలని మీడియాకు సీఎం విన్నవించారు. ఈ ఇద్దరు మంత్రుల ద్వారా చెప్పిందే అసలైన నిర్ణయాలు’ అని పేర్కొన్నారు.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్