తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాటను సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడంపై మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేమైనా నాటు నాటు పాటనా? అంటూ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంతరం
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాటను సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడంపై మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేమైనా నాటు నాటు పాటనా? అంటూ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. అందెశ్రీ నిస్సహాయుడై కూర్చున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా.. ‘అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది బై? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక? సీఎం రేవంత్ రెడ్డి గారూ.. కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది "నాటు నాటు" పాట కాదు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందల మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతి రూపం. ఒక రణ నినాదం. ధిక్కార స్వరం. అందెశ్రీ గారిచ్చిన ఒరిజినల్ ట్యూన్‌తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3, 2011 విద్యార్థి గర్జనలో లక్షల మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలాపించిన తీరు చూసుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు. మీరు ఆ టైంలో అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకిది తెల్వదు. నేనారోజు అక్కడ ఉన్న కాబట్టి చెప్తున్నా. పాపం అందెశ్రీ అమాయకుడు, నిస్సహాయుడు కాబట్టి మౌనంగా కూర్చున్నడు. మీరేం చేసినా భరిస్తున్నడు. తెలంగాణ ప్రజలారా.. జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన గీతాన్ని పాడుకుందమా? లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందమా?’ అని ప్రజలను అడిగారు.