ఎన్నికల సంఘం అనుమతితో ఈ రోజు భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది.
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: ఎన్నికల సంఘం అనుమతితో ఈ రోజు భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇక మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి చివరి గింజ వరకు కొనాలని అధికారులకు ఆదేశాలు వెళ్లనున్నాయి. ఈ మేరకు కేబినెట్‌లో తీసుకొన్న వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
'అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలి. మద్దతు ధర కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ రైతులకు చెల్లించకూడదు. రాష్ట్రానికి అవసరమైన సన్నబియ్యాన్ని రాష్ట్రంలోనే సేకరించాలని నిర్ణయం. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందజేస్తాం. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. సర్కారు బడుల ఆధునీకరణకు 600 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమ్మఆదర్శ పాఠశాల పనులకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయాలని నిర్ణయం' తీసుకున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు.
కాగా, మంత్రివర్గ సమావేశంపై ఈసీ పలు షరతులు పెట్టిన విషయం తెలిసిందే. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించవద్దని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో విద్యాసంస్థల్లో వసతులు, ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ బరాజ్ తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.