Jaya Jayahe Telangana Song | తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రాష్ట్ర గీతం, రాష్ట్ర అధికారిక చిహ్నం చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాటను స్వరకల్పనను కీరవాణికి అప్పగించడం దుమారం రేపగా, అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అగ్గి రాజేసింది.
కేసీఆర్
హైదరాబాద్, ఈవార్తలు : Jaya Jayahe Telangana Song | తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రాష్ట్ర గీతం, రాష్ట్ర అధికారిక చిహ్నం చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాటను స్వరకల్పనను కీరవాణికి అప్పగించడం దుమారం రేపగా, అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అగ్గి రాజేసింది. చారిత్రక ఆనవాళ్లను తొలగించాలన్న నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయితే, రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించలేదు. ఆనాడు ఎందుకు ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించలేదన్న ప్రశ్నకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్లారిటీ ఇచ్చారు. గీతంలో స్వల్ప సవరణలు చేయాలని కేసీఆర్ సూచించారని, అందుకు కవి, రచయిత అందెశ్రీ ఒప్పుకోలేదని రసమయి వెల్లడించారు.
‘జయ జయహే తెలంగాణ గీతంలోని నాలుగు చరణాలను స్వల్పంగా సవరించి రాష్ట్ర గీతంగా ప్రకటించాలని నాడు కేసీఆర్ భావించారు. 2014లోనే అందెశ్రీతో అనేకసార్లు చర్చలు జరిపారు. దానికి అందెశ్రీ ఒప్పుకోలేదు. తాను రాసిన పది, పన్నెండు చరణాలను అలాగే ఉంచాలని పట్టుబట్టారు. లేకపోతే ఆ పాటను రాష్ట్ర గీతంగా వాడొద్దని స్పష్టం చేశారు. వాస్తవానికి రాష్ట్ర గీతానికి పది, పన్నెండు చరణాలు పెట్టడం సాధ్యం కాదు. దీంతో వివాదం ఉండొద్దన్న ఉద్దేశంతో కేసీఆర్ ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు. అంతే తప్ప జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించవద్దనో, అందెశ్రీని అగౌరవపరచాలనో కాదు’ అని రసమయి పేర్కొన్నారు.