రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు (మంగళవారం) భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన ఉందని వివరించింది.
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: ఒకవైపు ఎండలు.. మరోవైపు వడగాలులు.. ఇంకోవైపు.. ఉక్కపోత.. వెరసి సగటు వ్యక్తి ఇంట్లో ఉండలేక, బయటికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకెప్పుడు వర్షాలు పడతాయోనని కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక్క వానైనా గట్టిగా కొట్టిపోతే బాగుండు! అని ఆలోచించని వ్యక్తి లేడు. అయితే, ఈ దగడు నుంచి భారీ ఉపశమనం కలిగించే వార్తను వాతావరణ శాఖ అందించింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు (మంగళవారం) భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన ఉందని వివరించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో వానలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, నల్లగొండ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, మహబూబ్‌నగర్, వికారాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దక్షిణ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి.
ఉక్కపోత నుంచి ఉపశమనం..
వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో వడగండ్లు పడే అవకాశం ఉందని వెల్లడించారు. వడగళ్ల వాన కురిసే జిల్లాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల ఉన్నాయి. ఇక.. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశాలు ఉన్నాయి. బుధ, గురువారాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.