జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి పుణ్యక్షేత్రం కొంగు బంగారమై భక్తుల కోర్కెలు నెరవేర్చుతూ నిత్య పూజలు అందుకుంటోంది. నారసింహ అవతారంలో ఉండే ఆంజనేయస్వామి.. భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు.
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం
కొండగట్టు, ఈవార్తలు: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి పుణ్యక్షేత్రం కొంగు బంగారమై భక్తుల కోర్కెలు నెరవేర్చుతూ నిత్య పూజలు అందుకుంటోంది. నారసింహ అవతారంలో ఉండే ఆంజనేయస్వామి.. భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ దేవుడిని దర్శించుకునేందుకు ఏటా కోట్లలో భక్తులు తరలి వస్తుంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం కొండగట్టు ఆంజనేయస్వామి భక్తుడే. తన జైత్రయాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించి విజయం సాధించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇక్కడికి వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు అనే అంశం మరో ఎత్తు. దేవుడిని దర్శించుకునేందుకు రావాలంటే కనీసం జేబులో రూ.5 వేలు పెట్టుకొని రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జరిగే అరాచకాలు ఏ మీడియాకు కనిపించవా? అని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెలిబుచ్చాడు. కొండగట్టులో జరిగే నిలువుదోపిడీని కండ్లకు కడుతూ.. పూజారులు, ప్రైవేట్ వ్యక్తులు చేసే అరాచకాలను వివరించాడు.
‘మొదటగా ఆలయంలోకి వాహనాలతో ప్రవేశించాలి అంటే లేదా వాహన పూజ ఉంటే ప్రైవేటు ఎంట్రీ ఫీజు రూ.150 నుండి ఉంటుంది. ఇక కొండమీద ఉన్న ఒక కిరణాషాపు, ఓ పూజాసామగ్రి షాపు మనకు దేవుడి దర్శనాన్ని ముందే చూపిస్తాయి. అక్కడ ఏది కొన్నా రెండింతలు ఉంటుంది. ధర సరే అని పూజా సామగ్రి కొనుక్కొని.. కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనానికి ఆలయంలోకి వెళ్తే డబ్బులు హుండీలో కాదు.. పక్కన పెట్టండి అంటారు. ఆ తర్వాత అర్చన చేయాలంటే రూ.100 ఇవ్వాలి. ఇది దేవాలయ అర్చన టికెట్ కాదు. అందులో పూజారి టికెట్. అక్కడినుంచి భేతాళస్వామి దగ్గరికి వస్తే అక్కడ రూ.50 ఇవ్వండి.. అర్చన చేస్తాం అని పూజారి అంటాడు. అక్కడ నుండి వాహనపూజ దగ్గరికి వస్తే వాహన పూజ టికెట్ ధర ఆలయానికి సంబంధించింది ఉండగా, పూజ చేసిన అనంతరం పూజారి సొంత టికెట్ రేటు రూ.500 ఉంటుంది. వాహనాలకు నిమ్మకాయల దండ.. చిట్టి పూసల దండ కట్టిన వారి టికెట్ వేరే ఉంటుంది.
సరే ఇవన్నీ అయిపోయాయి అని కిందికి వచ్చి వంట చేసుకొందామంటే అక్కడ టికెట్ రూ.500 నుంచి రూ.2,000 వరకు ఉంటుంది. కనీస నీటి వసతి, బాత్‌రూం వసతి ఉండవు. సరేలే అని సరిపెట్టుకున్నా.. ఒక మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అనుకుంటే రూ.30 చెల్లించుకోవాల్సిందే. కూల్ వాటర్ అయితే రూ.60 ఇచ్చుకోవాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో దోపిడీలు ఉన్నాయి. ఈ రేట్లన్నీ ప్రైవేటుగా వసూలు చేస్తున్నవే. ఇందులో ఏ ఒక్క రూపాయి కూడా దేవాలయ హుండీలోకి కానీ, దేవాలయంలోకి కానీ వెళ్లదు. ఇంత జరుగుతున్నా దేవాలయ ఈవో ఏం చేస్తున్నారు? ఇంత దోచుకుంటున్నా.. ప్రశాంతత కోసం దేవుడి వద్దకు వచ్చి గొడవ పెట్టుకోవటం ఎందుకని భక్తులు సరిపెట్టుకుంటున్నారు’ అని కొండగట్టు గుట్టపై ఎక్కడెక్కడ దోపిడీ జరుగుతుందో పూస గుచ్చినట్టు వివరించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ దోపిడీపై అధికారులు స్పందిస్తారా?