సీఎం రేవంత్ ఢిల్లీ టూర్స్.. మరి ఇంతవరకూ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా?

రేవంత్ ఢిల్లీ టూర్స్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన ఢిల్లీ టూర్స్ తో తెలంగాణకు ఇంతవరకూ ఏమైనా ప్రయోజనం కలిగిందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ట్విట్టర్ లో ఇటు మీడియా ఎదుట నిలదీస్తున్నారు.

cm revanthreddy

ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, హైదరాబాద్: నిరుడు డిసెంబర్ లో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. గత సర్కారు కేంద్రంతో సఖ్యతగా లేదని, తాము కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో మర్యాదపూర్వకంగా నడుచుకొని, రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొస్తామని చెప్పారు. అన్నట్టే నెలకు రెండు సార్లు ఢిల్లీకి వెళ్తూ.. ప్రధానిమంత్రితోపాటు కేంద్ర మంత్రులనూ కలిసి, రాష్ట్రానికి కావాల్సిన నిధులు, విభజన హామీలపై రేవంత్ వినతులు ఇచ్చి వస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలనూ కలిసి, రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చిస్తున్నారు. అయితే, రేవంత్ ఢిల్లీ టూర్స్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన ఢిల్లీ టూర్స్ తో తెలంగాణకు ఇంతవరకూ ఏమైనా ప్రయోజనం కలిగిందా?  అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ట్విట్టర్ లో ఇటు మీడియా ఎదుట నిలదీస్తున్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాలే కాకుండా సోషల్ మీడియా నెటిజన్లు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

11 నెలల్లో 25 సార్లు ఢిల్లీకి..

తెలంగాణ కోసం నిధులు తెచ్చేందుకే తాను ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నానని సీఎం రేవంత్ ప్రతిసారి ప్రకటిస్తున్నారు. అలా..11 నెలల్లో 25 సార్లు ఢిల్లీ వెళ్లారు. బాధ్యతలు స్వీకరించాక ప్రధాని మోదీని కలిసి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రావాల్సిన నిధులు ఇవ్వాలని విన్నవించారు. తెలంగాణకు ఐఐఎంను మంజూరు చేయాలని, ఐటీఐఆర్ ప్రాజెక్టను పునరుద్ధరించాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని, సెమీ కండక్టర్ మిషన్ లో తెలంగాణకు చోటు కల్పించాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో వచ్చే ఐదేండ్లలో 25 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, నిధులు కేటాయించాలని విన్నవించారు. మూసీ ప్రక్షాళనకు రూ. 4వేల కోట్టు ఇవ్వాలని కోరారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్ లను ఎంపిక చేయాలని అన్నారు. అయితే, కేంద్ర సర్కారు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వినతులను పెడచెవినే పెట్టింది. కేంద్ర బడ్జెట్ లో ఇందులో ఏ ఒక్క వినతిపై ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.  ఇదిలా ఉండగా, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరదలొచ్చి తీవ్ర నష్టం వాటిల్లింది. మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వరద సాయం ప్రకటించాలని కేంద్రాన్ని స్వయంగా రేవంత్ కోరారు. అయితే, పక్కనే ఉన్న ఏపీకి కేంద్ర సర్కారు రూ.వెయ్యి కోట్లు ఇచ్చి.. తెలంగాణకు మాత్రం కేవలం 400 కోట్లతో సరిపెట్టారు. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ తాను విభజన హామీల సాధనకే వెళ్తున్నానని చెప్తున్నా..ఇప్పటివరకూ కేంద్రం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో నే సీఎం ఢిల్లీ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్తూ.. పనిలో పనిగా పని జరగదని తెలిసినా రేవంత్.. కేంద్ర మంత్రులను కలిసినట్టు మీడియా లో కనిపించేందుకే పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారని అటు ప్రతిపక్ష నాయకులతోపాటు నెటిజన్లు, సాధారణ జనం కూడా చర్చించుకుంటున్నారు. ఎలాంటి ఫాయిదా లేనప్పుడు నెలకు రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధానిని కలవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 

 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్