రేకులకుంట ఎలమ్మ గుడిలో ఒగ్గు పూజారుల దోపిడీ.. మినిమం రూ.5 వేలు ఇస్తేనే పట్నం..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట గ్రామంలోని పచ్చని గుట్టల్లో దేవదేవులు శ్రీ మల్లికార్జునస్వామి, ఎల్లమ్మతల్లి కొలువుదీరారు. ఇక్కడ భక్తులు మల్లన్న, ఎల్లమ్మకు బోనం తీయడం, పట్నం వేయటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు.

rekulakunta
ఎల్లమ్మ పట్నం వేస్తున్న ఒగ్గు పూజారి

దుబ్బాక, ఈవార్తలు : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట గ్రామంలోని పచ్చని గుట్టల్లో దేవదేవులు శ్రీ మల్లికార్జునస్వామి, ఎల్లమ్మతల్లి కొలువుదీరారు. ఇక్కడ భక్తులు మల్లన్న, ఎల్లమ్మకు బోనం తీయడం, పట్నం వేయటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. గొర్రె, మేక పిల్లలను మత్తగొలుపు లాంటివి చేస్తుంటారు. ఇక్కడికి రావటానికి ఎలాంటి ప్రయాణ సదుపాయాలు ఉండవు. ప్రత్యేకంగా ప్రైవేటు వాహనాలను కిరాయికి మాట్లాడుకొని వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి. అదీ రాత్రి సమయాల్లోనే. సాయంత్రానికి గుడి వద్దకు చేరుకునే భక్తులు నిష్టగా స్నానం చేసి, ఎల్లమ్మ, మల్లన్నకు బోనాలు వండుతారు. రెండు ఆలయాల్లో పట్నం వేసి మొక్కు తీర్చుకుంటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆలయంలో బోనం దగ్గరి నుంచి పట్నం దాకా.. అన్ని పూజా సేవలకు టికెట్ రుసుం వసూలు చేస్తుంటారు. అదంతా ప్రభుత్వం వసూలు చేస్తున్నదే. అయినా, ఒగ్గు పూజారులు పట్నం వేసే దగ్గర భక్తులను పీల్చి పిప్పి చేస్తున్నారు. పట్నం మీద మినిమం రూ.5 వేలు పెడితేనే కథ ముందుకు సాగుతుంది. లేదంటే.. పట్నం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవడానికి ఏ మాత్రం వెనుకాడరు.

టికెట్ తీసుకున్నా.. మళ్లీ ఎందుకు కట్నం పెట్టాలని అడిగితే.. ఇక్కడ అంతే.. ఇవ్వకపోతే నడవదు అని డిమాండ్ చేస్తారు. వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాటలా చెలామణి అవుతోంది. ఎంతో మంది భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. ఇక్కడిదాకా వచ్చి మొక్కులు చెల్లించుకుందామంటే ఒగ్గు పూజారులు కట్నం కోసం డిమాండ్ చేస్తుంటారు. ఇవ్వని వాళ్లను నానామాటలతో దుర్భాషలాడుతుంటారు. తాము అడిగినంత ఇవ్వకపోతే పూజ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతారు. గత్యంతరం లేక భక్తులు వాళ్లు అడిగినంత ఇచ్చుకోవాల్సి వస్తోంది.

ఒగ్గు పూజారుల ఆగడాలపై ఆలయ ఈవోకు ఫిర్యాదు చేద్దామంటే.. ఈవో అందుబాటులో ఉండడు. అందుబాటులో ఉన్న టికెట్ తీసుకునే వ్యక్తి కూడా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుంటాడు. ఇక్కడ మరో ఘనకార్యం ఏంటంటే.. ఆలయ ఈవో నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేద్దామంటే అక్కడ ఉన్న ఫ్లెక్సీపై ఈవో నంబర్ దగ్గర ప్లాస్టర్ అతికేసి ఉంటుంది. అంటే ఈవో నంబర్ కనిపించకుండా చేశారన్న మాట. ఒకవేళ పాత ఈవో నంబర్ మారితే.. కొత్త ఈవో నంబర్ అక్కడ ఏర్పాటు చేయాలి. కానీ, అలాంటిదేమీ లేదక్కడ. ఒగ్గు పూజారులతో ఈవో కూడా కుమ్మక్కయ్యారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. 

ఇక, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయంలో ఎక్కడా వసతి ఏర్పాటు లేదు. వర్షాకాలంలో వర్షం పడితే కట్టుబట్టలు, తెచ్చుకున్న సామానుతో సహా అంతా తడిసి ముద్దవ్వాల్సిందే. గుడిసెల్లో ఉందామంటే శుభ్రంగా ఉండవు. అసలే అటవీ ప్రాంతం.. పాములు, తేళ్లు, విషసర్పాలు కుడితే ఎలా? అన్న సోయి కూడా అధికారులకు లేకపోవడం గమనార్హం. ఎక్కడా శుచి, శుభ్రత ఉండదు. వాడిపాడేసిన కవర్లు.. చెత్తాచెదారంతో ఆలయ ప్రాంగణం నిండి ఉంటుంది. పచ్చని గుట్టల్లో ప్లాస్టిక్ భూతం తాండవం చేస్తున్నట్లు ఉంటుంది ఆ ప్రాంతం. అధికారులు పట్టించుకోక, ఆలయ కమిటీ నిర్వహణ సరిగా లేక.. అడిగేవారు లేక.. ఆదేశించేవారు లేక.. అంతా అస్తవ్యస్తంగా నడుస్తోంది.

ఇప్పటికైనా ఒగ్గు పూజారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు కోరుతున్నారు. వందల కిలోమీటర్లు దాటొచ్చి, మొక్కులు తీర్చుకొని సేద తీరుదామంటే కనీసం ఏర్పాట్లు లేకపోవడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ప్రతి పూజ సేవకు టికెట్ వసూలు చేస్తున్న దేవాదాయ శాఖ.. పరిశుభ్రత పాటించడంలో ఎందుకు అలసత్వం వహిస్తోందని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసి, ఒగ్గు పూజారుల దోపిడీని నియంత్రించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్