నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.
నిజామాబాద్, ఈవార్తలు : నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఈయన నిజామాబాద్ ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు తండ్రి. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన డీఎస్.. సామాన్య స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం పాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. కాగా, డీఎస్ మరణంపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా, తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తుచేసుకున్నారు. డీఎస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా, పలువురు ఏపీ, తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులు కూడా డీఎస్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
కన్నీరు పెట్టిస్తున్న ధర్మపురి అర్వింద్ ట్వీట్
తన తండ్రి డీఎస్ మరణంపై ధర్మపురి అర్వింద్ చేసిన ట్వీట్ హృదయాలను ద్రవించేలా ఉంది. ‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు. ప్రజల కొరకు జీవించు అని చెప్పిందీ మా నాన్నే. నాన్నా...నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఎప్పటికీ నాలోనే ఉంటావు’ అని ట్వీట్ చేశారు.