మూసీ నదిపై సీఎం రేవంత్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. మురికికూపంగా ఉండడం వల్లే మూసీ పేరును ఎవరూ పెట్టుకోవడం లేదని కామెంట్ చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పుడు మూసీ నది ఓ హాట్ టాపిక్. ఈ నది మురికికూపంగా మారిందని, దీన్ని ప్రక్షాళన చేసి, దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ సర్కారు పట్టుబట్టింది. రూ.లక్షన్నర కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ పనులు చేపడుతామని ప్రకటించింది. లండన్ లోని థేమ్స్ నదిలా దీన్ని మార్చి, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అంటున్నది. ఇందుకోసం మొదట మూసీ రివర్ బెడ్ లో ఉన్న గుడిసెలు, ఇండ్లను కూల్చివేస్తున్నది. వారందరికీ మరోచోట డబుల్ బెడ్ రూం లు ఇస్తామని పేర్కొంటున్నది. అయితే, కొందరు మూసీ నివాసితులు ప్రభుత్వం చెప్పినట్టు వెళ్లిపోయేందుకు అంగీకరించగా, మరికొందరు ఏండ్లుగా ఉంటున్న తమ ఇండ్లను ఖాళీ చేసేదే లేదని తేల్చి చెప్తున్నారు. వారికి బీఆర్ఎస్ తోపాటు బీజేపీ అండగా నిలుస్తున్నది. ఇండ్లు కూల్చొద్దంటూ స్థానికులతో కలిసి ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఈ నేపథ్యంలో మూసీ నదిపై సీఎం రేవంత్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
రేవంత్ ఏమన్నారంటే?
రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాలకు సెలెక్ట్ అయిన 1600 మందికి ఆదివారం కొలువుల పండుగ పేరిట సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆపబోమని చెప్పారు. మురికికూపంగా మారిన మూసీ నదితో అక్కడి ప్రజలతోపాటు నగరవాసులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. భారీ వర్షం వస్తే నీళ్లు ఎటు వెళ్లవని, దీంతో వరదలు వచ్చి నగరం మునుగుతుందని అన్నారు. అందరూ తమ బిడ్డలకు గంగా, యమున, సరస్వతి నదుల పేర్లను పెట్టుకుంటున్నారని, కానీ.. మురికికూపంగా ఉండడం వల్లే మూసీ పేరును ఎవరూ పెట్టుకోవడం లేదని కామెంట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లనుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు సీఎం మాటలను సపోర్ట్ చేయగా, మరికొందరు దీనిపై రేవంత్ కు అవగాహన లేదంటూ పోస్ట్ లు పెట్టారు. మూసీ అంటే ముచుకుంద అనే అర్థం వస్తుందని, అది పురుషుడి పేరని చెప్తున్నారు. అలాంటప్పుడు ఆడబిడ్డలకు మూసీ అని ఎలా పేరు పెట్టుకుంటారని అంటున్నారు. సీఎం ముందు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని చురకలంటిస్తున్నారు.