జగిత్యాల జిల్లాలో స్కానర్ల మోసాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా నిండా ముంచేస్తారని స్పష్టం చేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
జగిత్యాల, ఈవార్తలు : జగిత్యాల జిల్లాలో స్కానర్ల మోసాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా నిండా ముంచేస్తారని స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి చీరలు కొనటానికి వచ్చి.. స్కానర్ పనిచేయటం లేదని చేసిన మోసాన్ని బయటపెట్టారు. వివరాల్లోకెళితే.. 2 రోజుల క్రితం జగిత్యాలలోని ఒక వస్త్ర దుకాణానికి నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్2పై వెళ్లి ఆ షాపులో 3 చీరలు కొన్నాడు. వాటి విలువ రూ.2,200 కాగా, తన దగ్గర డబ్బులు లేవని.. ఫోన్‌పే చేస్తానని చెప్పాడు. తనకు ఇంకా డబ్బు అవసరం ఉన్నదని, రూ.10 వేలు పంపిస్తా.. తనకు ఇవ్వాలని కోరాడు. అందుకు దుకాణా యజమాని సరేనని ఒప్పుకున్నది. స్కానర్ చూపించగా, అది పనిచేయటం లేదు.. వేరే నంబర్ ఉంటే చెప్పాలని అతడు అడిగాడు.
దాంతో ఆమె తన భర్త నంబర్ చెప్పింది. ఆ నంబర్‌కు రూ.10 వేలు పంపినట్లు ఫేక్ మెసేజ్ చూపించి రూ.10 వేలు తీసుకొని ఉడాయించాడు. తర్వాత ఆమె తన భర్తకు ఫోన్ చేసి అడగ్గా, అతడు రాలేదని తెలిపాడు. మోసపోయామని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.