మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్‌పల్లి గ్రామంలో రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వడ్ల కొనుగోళ్లు ప్రారంభించలేదని బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన అన్నదాతలు.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ట్రాక్టర్‌కు కట్టి ఊరేగించారు.
దేవరకద్ర, ఈవార్తలు : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్‌పల్లి గ్రామంలో రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వడ్ల కొనుగోళ్లు ప్రారంభించలేదని బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన అన్నదాతలు.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ట్రాక్టర్‌కు కట్టి ఊరేగించారు. అనంతరం ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోళ్లు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్ల కొనుగోళ్లకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాగా, రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సారి రికార్డు స్థాయిలో 66.70 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, వడ్ల కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 7,750 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. రైతులందరికీ సన్న రకాలకు రూ.500 బోనస్ ఇస్తామని వివరించారు. అయితే, క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదని రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. మంత్రుల స్టేట్‌మెంట్లు కిందిస్థాయిలో అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.