మళ్లీ ఉరికొయ్యలకు నేతన్నల బతుకులు.. దంపతుల ఆత్మహత్యపై కేటీఆర్ ఆవేదన

బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక బతుకు భారంతో నేతన్నల దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నల బతుకులు మళ్లీ ఉరికొయ్యకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ktr

కేటీఆర్

సిరిసిల్ల, ఈవార్తలు : బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక బతుకు భారంతో నేతన్నల దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నల బతుకులు మళ్లీ ఉరికొయ్యకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని బైరి అమర్, స్రవంతి దంపతులు సాంచాలు నడుపుతున్నారు. అయితే, వ్యాపారం నడవక రూ.96 లక్షల వరకు అప్పు అవడంతో ఇంట్లోనే దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన కేటీఆర్.. కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన ట్విటర్ వేదికగా ‘కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నల మగ్గాలను మళ్లీ ఆపింది! కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నలను అప్పులపాలు జేసింది! కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నలకు మళ్లీ ఉరితాడునిచ్చింది! బతుకమ్మ చీరలతో నేతన్నలకు కేసీఆర్ ఉపాధితో కల్పిస్తే.. కాంగ్రెస్సోల్లు కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసేందుకు నేతన్న కడుపు కొడుతుండ్రు! కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలపై విపరీతమైన కక్ష.. మీ రాజకీయానికి అనాథలైన ఈ బిడ్డలకేది తల్లిదండ్రుల రక్ష! తల్లిదండ్రుల చెంత అల్లారుముద్దుగా పెరగాల్సిన ఈ బిడ్డలను అనాథలు చేసిన పాపం ఊరికే పోదు.. ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది! పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటూ మా గోరటి వెంకన్న పాడిన సాలెల మగ్గం సడుగులిరిగినయ్ అనే పాట కాంగ్రెస్ పాలనలో మళ్లీ యాదికొస్తుంది!’ అని కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్