మంత్రి తుమ్మల మాటలతో సీఎం రేవంత్ బండారం బట్టబయలైందని కేటీఆర్ విమర్శించారు. వందశాతం రుణమాఫీ పూర్తయిందని సీఎం చెప్పిన మాటలన్నీ డొల్లేనని మరోసారి నిరూపితమైందని మండిపడ్డారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. నిరుడు అధికారం చేపట్టాక కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్ సర్కారు ఈ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పింది. ఆగస్టు 15 లోగా వందశాతం చేసి తీరుతామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ లోపు రాష్ట్ర సర్కారు రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు సవాల్ చేశారు. అయితే, కొంతమంది రైతులకు రుణమాఫీ జరగ్గా.. మరికొంతమంది తమకు మాఫీ కాలేదంటూ రోడ్డెక్కారు. కలిసిన కాంగ్రెస్ లీడర్లను నిలదీస్తున్నారు. మరోవైపు తాము రుణమాఫీ చేశామని, కానీ ప్రతిపక్షాలు కావాలని రైతులను రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇటీవల చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఆయన కుండబద్ధలుకొట్టారు. త్వరలో 2లక్షల పైన ఉన్న రైతుల కోసం ప్రక్రియ ప్రారంభిస్తామని, షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ తోపాటు బీజేపీ మండిపడుతున్నాయి. కొంతమంది రైతులకే రుణమాఫీ చేసి, కాంగ్రెస్ చేతులు దులుపుకున్నదంటూ ఫైర్ అవుతున్నాయి. మంత్రి తుమ్మల వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు.
రేవంత్ చాతకాని తనంతో రైతులకు శాపం: కేటీఆర్
మంత్రి తుమ్మల మాటలతో సీఎం రేవంత్ బండారం బట్టబయలైందని కేటీఆర్ విమర్శించారు. వందశాతం రుణమాఫీ పూర్తయిందని సీఎం చెప్పిన మాటలన్నీ డొల్లేనని మరోసారి నిరూపితమైందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్నదాతలను నయవంచనకు గురిచేశారని అన్నారు. రాబందుల ప్రభుత్వంతో రైతులకు లాభం లేదని చెప్పారు. రేవంత్ చేతకానితనం అన్నదాతలకు శాపంగా మారిందని ఫైర్ అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారమే 20లక్షలుంటే.. ఇంకా అనధికారికంగా ఎంతమంది ఉన్నారో అని అనుమానం వ్యక్తంచేశారు. సీజన్ ముగిసినా రైతుబంధు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. డిసెంబర్ 9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి.. పదినెలలైనా ఇంకా 20 లక్షల మందికి చేయకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు.