Kinley vs Kenlay | ఆర్టీసీ బస్టాండ్లలో డూప్లికేట్ కంపెనీలతో నీళ్ల బాటిళ్ల దందా.. పట్టించుకోని అధికారులు

కోకాకోలా బ్రాండ్‌కు చెందిన కిన్‌లే (Kinley) వాటల్ బాటిల్ అడిగితే.. దాన్ని కాపీ కొట్టి తయారు చేసిన కెన్‌లే (Kenlay) వాటల్ బాటిల్ ఇచ్చారని వాపోయింది. ఇదేం కంపెనీ ఎప్పుడూ చూడలేదు అని ప్రశ్నిస్తే తీసుకుంటే తీసుకో.. లేకపోతే లేదు అని దుకాణదారుడు దురుసుగా మాట్లాడాడని వెల్లడించింది.

tgs rtc water bottles

ఆర్టీసీ బస్టాండ్లలో డూప్లికేట్ వాటల్ బాటిళ్ల దందా

హైదరాబాద్, ఈవార్తలు : నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్లలో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. ఏ వస్తువు కొన్నా ఎమ్మార్పీ రేట్ల కన్నా రూ.10 ఎక్కువే చెల్లించాల్సిన దుస్థితి. పైగా, కొన్ని ప్రముఖ బ్రాండ్ల పేర్లను కాపీ కొట్టి.. అచ్చం వాటిలాగే డూప్లికేట్ వస్తువులు తయారుచేసి అమ్ముతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. బస్టాండ్లలోని ప్రతి దుకాణం ముందు.. ‘ఇచ్చట ప్రతి వస్తువు ఎమ్మార్పీ రేటుకు మాత్రమే అమ్మబడును’ అని రాసి ఉంటుంది. కానీ, ఏ ఒక్క దుకాణదారుడు కూడా ఆ వస్తువును ఎమ్మార్పీ రేటుకు అమ్మడం లేదు. ముఖ్యంగా తెలంగాణలోని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రాష్ట్రంలోని ఏ బస్టాండులో చూసినా.. ఏ దుకాణాన్ని తట్టినా.. ఏ వస్తువు కొన్నా.. ఎమ్మార్పీ రేటు కన్నా రూ.5- రూ.10 ఎక్కువకు అమ్ముతున్నారు. ఈ విషయం ఆయా బస్టాండ్లలో పనిచేసే అధికారులకు కూడా తెలుసు. అయినా, ఎవరూ పట్టించుకోరు. ఫిర్యాదు చేద్దామని వెళితే చులకనగా చూస్తారు. పైఅధికారులకు ఫిర్యాదు చేద్దామంటే ఎలా ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి.

అసలు వివరాల్లోకెళితే.. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండులో ఓ యువతి వాటర్ బాటిల్ కొందామని బస్టాండులోని ఓ దుకాణం వద్దకు వెళ్లి నీళ్ల బాటిల్ కావాలని అడిగింది. దానిపై ఉండే రేటు రూ.20 మాత్రమే. కానీ, కూలింగ్ చార్జీలు అని చెప్పి రూ.5 అదనంగా వసూలు చేశారు. అంటే.. మొత్తంగా రూ.25 చెల్లించాలన్నమాట. వాటల్ బాటిల్ మాత్రమే కాదు.. ఏ వస్తువు కొన్నా.. ఎమ్మార్పీ రేటు కన్నా అదనంగా ఇచ్చుకోవాల్సిందే. ఇదే విషయాన్ని ఆ యువతి వీడియో ద్వారా చెప్తూ ఆవేదన వ్యక్తం చేసింది. పైగా, తాను కోకాకోలా బ్రాండ్‌కు చెందిన కిన్‌లే (Kinley) వాటల్ బాటిల్ అడిగితే.. దాన్ని కాపీ కొట్టి తయారు చేసిన కెన్‌లే (Kenlay) వాటల్ బాటిల్ ఇచ్చారని వాపోయింది. ఇదేం కంపెనీ ఎప్పుడూ చూడలేదు అని ప్రశ్నిస్తే తీసుకుంటే తీసుకో.. లేకపోతే లేదు అని దుకాణదారుడు దురుసుగా మాట్లాడాడని వెల్లడించింది. ఇదే విషయాన్ని బస్టాండులో ఉన్న పోలీస్ అధికారికి ఫిర్యాదు చేద్దామని వెళ్తే.. ఆ పోలీస్ అధికారి కూడా చులకన మాట్లాడాడని చెప్పింది. డూప్లికేట్ బ్రాండింగ్ వాటర్ బాటిళ్ల దందాపై ఎక్కడ ఫిర్యాదు చేయాలని అడిగితే.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా..! అంటూ ఆ పోలీస్ బదులు ఇచ్చారని వివరించింది.

వాస్తవానికి, ఆ యువతికి మాత్రమే కాదు.. ప్రతి ఒక్క ప్రయాణికుడికి ఇలాగే జరుగుతోంది. ఆదరాబాదరాగా బస్సు ఎక్కి వెళ్లిపోవాల్సి రావడంతో, గొడవ ఎందుకు? అని ప్రయాణికులు ఎంతో కొంత అదనంగా చెల్లించి, వాటర్ బాటిళ్లు కొనుక్కొని వెళ్లిపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని బస్టాండుల్లోని దుకాణదారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల లోగోలను కాపీ కొడుతూ ఇష్టమొచ్చినట్లు రేట్లు పెడుతూ ఆహార పదార్థాలను అమ్ముతున్నారు. వీటిలో ఎక్కువ కమీషన్ వస్తుండటమే కారణంగా తెలుస్తోంది. బస్టాండ్లలో దుకాణదారుల దోపిడీని అరికట్టాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు ప్రయాణికులు విన్నవిస్తున్నారు. యువతితో పోలీస్ అధికారి వ్యవహరించిన తీరుపై విచారణ చేపట్టాలని, ఆ పోలీస్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్