కేసీఆర్ ఎఫెక్ట్.. జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా.. మీడియాతో కీలక వ్యాఖ్యలు

విద్యుత్తు కమిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ నరసింహారెడ్డి మంగళవారం రాజీనామా చేశారు.

justice narasimha reddy

జస్టిస్ నరసింహారెడ్డి

హైదరాబాద్, ఈవార్తలు : విద్యుత్తు కమిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ నరసింహారెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు తాను మీడియా సమవేశం నిర్వహించానని తెలిపారు. ఆ సందర్భంగా తాను ఎక్కడా సొంత అభిప్రాయం చెప్పలేదని వివరించారు. తాను సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు ప్రచారం జరిగిందని, కానీ, తాను ఆయనతో ఫోన్‌లోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. ‘విద్యుత్తు కమిషన్ విచారణలో ఎవ్వరికీ నోటీసులు ఇవ్లేదు. 28 మందికి లేఖలు రాశా. కేసీఆర్ తప్ప మిగతా వారంతా వారి అభిప్రాయాలు చెప్పారు. ఎంతో మంది కమిషన్ చైర్మన్లు మీడియా సమావేశాలు పెట్టినా రాని అభ్యంతరం నాపైనే ఎందుకు వచ్చిందో తెలియలేదు’ అని తెలిపారు.

విద్యుత్తు కమిషన్‌ చైర్మన్‌గా కొనసాగే అర్హత లేదంటూ కేసీఆర్ తనకు లేఖ రాశారని, అందులో సమాజం అంగీకరించని భాష వాడారని జస్టిస్ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘అందరి అభిప్రాయాలు తీసుకొన్నాకే నివేదిక సిద్ధం చేశా. నేను ఇచ్చే నివేదిక నా వ్యక్తిగతం. దానిపై ఎవరికీ హక్కు లేదు. కమిషన్ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అంగీకరించవచ్చు.. లేదా అంగీకరించకపోవచ్చు. దాన్ని ఎవరైనా సవాల్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు.

కాగా, విచారణ కమిషన్ చైర్మన్‌గా వేరొకరిని నియమించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో చైర్మన్ పదవికి జస్టిస్ నరసింహారెడ్డి  రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం బెంచ్‌కు అందజేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్