హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం తాజాగా ఢిల్లీకి చేరింది. ఢిల్లీలోని JNU విద్యార్థులు హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోగో
న్యూఢిల్లీ, ఈవార్తలు : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం తాజాగా ఢిల్లీకి చేరింది. ఢిల్లీలోని JNU విద్యార్థులు హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడుతానంటూ రాజ్యాంగం చేతిలో పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నాడు. HCUలో జరుగుతున్న భూముల అమ్మకాలు రాహుల్ గాంధీకి కనపడటం లేదా? HCUలోని 400 ఎకరాల భూమిని ముట్టుకుంటే దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల విద్యార్థులను కలుపుకుని ముందుకువెళ్తాం. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. HCU విద్యార్థులకు అండగా ఉంటాం. అదానీ, అంబానీలకు భూములు అమ్ముతాం అంటే చూస్తూ ఊరుకోం. HCU అడవుల్లో అనేక జీవ జాతులు ఉన్నాయి. పక్షులు ఉన్నాయి అవి ప్రభుత్వం చర్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి’ అని తెలంగాణ ప్రభుత్వానికి JNU విద్యార్థులు హెచ్చరికలు పంపారు.
మరోవైపు, హెచ్‌సీయూ ప్రొఫెసర్లు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. యూనివర్సిటీ కోసం ఇచ్చిన భూమిని లాక్కోవడం ఏంటని మండిపడుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంధిరా గాంధీ యూనివర్సిటీకి ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు. ఆమె వారసులమని చెప్పుకునే ప్రస్తుత కాంగ్రెస్ నేతలు.. ఆమె ఆశయాలను తుంగలోకి తొక్కుతున్నారు. గతంలో కూడా యూనివర్సిటీ భూములు దోచుకోవడానికి ఎంతో మంది కుట్రలు చేశారు. భూములను వేలం వేయడం వల్ల జీవరాశులతో పాటు జీవ వైవిధ్యం నశిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వేలంపై మరోసారి ఆలోచించాలి. భూములను విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉపయోగించాలి’ అని స్పష్టం చేశారు. భూములను కాపాడుకొనేందుకు టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులంతా కలిసి పోరాడతామని తేల్చిచెప్పారు.