బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఆదిలాబాద్, ఈవార్తలు : బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం ధర్నా చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (IFTU) తెలిపింది. ఈ మేరకు యూనియన్ జిల్లా కమిటీ నాయకుడు బీ వెంకటనారాయణ కుమ్రంభీం భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు వెంటనే చేయూత పథకం కింద రూ.4 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతన జీవో విడుదల చేయాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ ప్యాకింగ్, చాటన్, నెలసరి ఉద్యోగులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నెలకు రూ.4 వేలు చెల్లించాలని వెల్లడించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని, కార్మికులందరికీ రూ. 10 వేల పింఛను ఇవ్వాలని అన్నారు.