హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కూల్చివేతలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. మేడ్చల్ - నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేతలు చేపట్టాయి.
రాంపల్లి, ఈవార్తలు : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కూల్చివేతలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. మేడ్చల్ - నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేతలు చేపట్టాయి. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీల సహాయంతో కూల్చివేస్తున్నారు. మరోవైపు, నగరంలోని బతుకమ్మకుంటపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బతుకమ్మ కుంటకు పునర్‌వైభవం తీసుకొస్తామని తెలిపారు. బుధవారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఆయన.. ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మ కుంట ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతలు చేపట్టబోమని, అయితే.. బతుకమ్మకుంటను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. కూల్చివేతలు ఉంటాయన్న అపోహలు ఉన్నందునే.. అలాంటివేమీ లేవని చెప్పటానికే తాను బతుకమ్మకుంటకు వచ్చానని వివరించారు.
ప్రస్తుతం బతుకమ్మ కుంట 5 ఎకరాల విస్తీర్ణంలో ఉందని.. ఆ ప్రాంతాన్నే పునరుద్ధరిస్తామని రంగనాథ్ చెప్పారు. కుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని అన్నారు. ఇక.. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని.. దానికి తగ్గట్టే ఆక్రమణదారులకు నోటీసులు వెళ్తున్నాయని చెప్పారు. నాగారంలో 15 ఏళ్లుగా కబ్జాలో ఉన్న నిర్మాణాలను తొలగించామని వివరించారు. ఆయన వెంట రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. కాగా, రంగనాథ్ పర్యటన నేపథ్యంలో బతుకమ్మ కుంటలో పోలీసులు భారీగా మోహరించారు. తమ ఇళ్లను కూల్చొద్దంటూ పలువురు నిరసనకు దిగారు. దీంతో వారితో మాట్లాడిన రంగనాథ్.. ఇళ్లను కూల్చబోమని స్పష్టంచేశారు.