జీవితంలో గుర్తుండిపోయే ఆలయం ఏదైనా ఉందీ అంటే అది ఆర్మూర్‌లోని సిద్ధులగుట్ట అని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని నిజామాబాద్ పట్టణానికి ఈశాన్యంగా 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూర్‌లో ఈ ఆలయం కొలువుదీరింది. ఈ ఆలయం పేరు శ్రీ నవనాథ సిద్ధేశ్వర దేవాలయం.
ఆర్మూర్ సిద్ధుల గుట్ట
జీవితంలో గుర్తుండిపోయే ఆలయం ఏదైనా ఉందీ అంటే అది ఆర్మూర్‌లోని సిద్ధులగుట్ట అని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని నిజామాబాద్ పట్టణానికి ఈశాన్యంగా 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూర్‌లో ఈ ఆలయం కొలువుదీరింది. ఈ ఆలయం పేరు శ్రీ నవనాథ సిద్ధేశ్వర దేవాలయం. ఈ ఆలయం 2 కిలోమీటర్ల మేర విస్తరించిన రాతి నిర్మాణం. రాళ్ల మధ్యలోని గుహల్లో కొలువుదీరిన ఆలయాల్లో శివుడు, దుర్గాదేవి, రాముడి, హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటినీ స్వయంభు ఆలయాలుగా నమ్ముతారు. ఈ మధ్యే కట్టిన ఘాట్ రోడ్డు ద్వారా గుట్టపైకి చేరుకోవచ్చు. ఈ గుహ లోపల ఉండే శివలింగం స్వయంభుగా వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ గుహ ఆలయానికి ప్రవేశ ద్వారం కేవలం 3 అడుగుల ఎత్తుతో ఉంటుంది. లోపలికి వెళ్తున్న కొద్దీ ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. శతాబ్దాల క్రితం దీన్ని నవనాథపురంగా పిలిచేవారు. ఆలయం లోపలంతా రాళ్లతో కప్పబడి ఉన్నా.. ప్రతి ఆలయంలో కావాల్సినంత వెలుతురు ఉండటం గమనించవచ్చు. ఆలయ ట్యాంక్, జీవా కోనేరు చూడదగ్గవి. రాతి స్తంభం నాటి టెక్నాలజీకి అద్దం పడుతుంది. ఆర్మూర్ (ఆరు + మూడు = ఆర్మూర్) అంటే 9 అనీ, అది నవనాథ సిద్ధులను తెలుపుతుంది.
స్థల పురాణం:
నవనారాయణాంశ సంభూతులే నవనాథులు. శ్రీపాద శ్రీ వల్లభుల ఆజ్ఞతో, శ్రీ కృష్ణావతారంలో చేసిన వాగ్దానం మేరకు వీళ్లు భూమి మీద అవతరించారు. నవనాథసిద్ధులు మరగుజ్జులుగా మారి సిద్ధులగుట్ట మీదగల రాళ్ల గుహలలో తపస్సు చేసిన ప్రదేశమిది. నవనాథులందరూ కలసి తపస్సు చేసినందున ఈ ప్రదేశానికి నవనాథ సిద్ధేశ్వరాలయం అని పేరు వచ్చింది. ఇక్కడి శివలింగాన్ని మత్చేంద్రనాథుడు ప్రతిష్టించిన అతి మహిమాన్విత శివలింగం అని చెప్తుంటారు. తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క నవనాథ ఆలయమిది. ఇక్కడి గుహల నుంచి ఉబికి వచ్చే నీరు సర్వవ్యాధి నివారిణిగా పనిచేస్తుంది.
సిద్ధులగుట్టకు చేరుకునే మార్గాలు:
- శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
- ఆర్మూర్, నిజామాబాద్ రైల్వేస్టేషన్లు ఈ ఆలయానికి దగ్గరలో ఉంటాయి. నిజామాబాద్‌లో దిగి.. ఇక్కడికి చేరుకోవచ్చు.
- నిజామాబాద్ పట్టణానికి సిద్ధులగుట్ట 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు.