జగిత్యాలలోని పలు హోటళ్లు, కిరాణా షాపులకు భారీ జరిమానా పడింది. కొన్ని ఫుడ్ శాంపిళ్లలో నాణ్యత తక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు జరిమానాతో కొరడా ఝలిపించారు.
ప్రతీకాత్మక చిత్రం
జగిత్యాల, ఈవార్తలు : జగిత్యాలలోని పలు హోటళ్లు, కిరాణా షాపులకు భారీ జరిమానా పడింది. కొన్ని ఫుడ్ శాంపిళ్లలో నాణ్యత తక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు జరిమానాతో కొరడా ఝలిపించారు. ‘పట్టణంలోని హోటల్స్, కిరాణా షాపుల్లో ఫుడ్ శాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపగా.. నాణ్యత తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. దాంతో మొదటి తప్పుగా షాపు యజమానులకు జాయింట్ కలెక్టర్ రాంబాబు జరిమానా విధించారు’ అని జగిత్యాల జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష తెలిపారు. మరోసారి తప్పు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జరిమానా పడిన హోటళ్లలో ఫేమస్ సామంతుల భోజనశాల ఉండటం గమనార్హం. వాస్తవానికి ఈ హోటల్ జగిత్యాల జిల్లాకేంద్రంలో టేస్టీ ఫుడ్ అందిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, జిల్లాకేంద్రానికి పని మీద వచ్చేవాళ్లంతా ఇక్కడి నుంచే ఆహారాన్ని తీసుకెళ్తారు. అయితే, ఈ హోటల్‌లోనూ ఆహార నాణ్యత నాసిరకంగా ఉండటంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా పబ్ రెస్టారెంట్ అండ్ బార్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
జరిమానా పడిన హోటల్స్, కిరాణా షాప్స్ ఇవే..
1. సామంతుల భోజనశాల రూ.2,50,000
2. సుఖీభవ రెస్టారెంట్ రూ.50,000
3. ఆనంద్ భవన్ రూ.75,000
4. నందిని సేవ మహల్ రూ.35,000
5. బెస్ట్ సూపర్ మార్కెట్ రూ.1,00,000
6. శివ సాయి కిరాణం రూ.90,000
7. శ్రీ రూప బెంగళూర్ బేకరీ రూ.30,000