మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు స్వయంగా సీఎం రేవంతే పోచారం ఇంటికి వెళ్లి ఆయనకు పార్టీలోకి ఆహ్వానం పలికారు.
హైదరాబాద్, ఈవార్తలు : వరుస పరాభవాలతో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్న బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు స్వయంగా సీఎం రేవంతే పోచారం ఇంటికి వెళ్లి ఆయనకు పార్టీలోకి ఆహ్వానం పలికారు. పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. రైతు పక్షపాతిగా సీఎం రేవంత్ చేస్తున్న మంచి పనులకు మెచ్చి ఆయనను తన ఇంటికి ఆహ్వానించానని తెలిపారు. రాజకీయంగా తాను ఇంకా ఆశించేది ఏదీ లేదని, రైతు సంక్షేమమేనని, ప్రభుత్వానికి అండగా ఉండి రైతుల కోసం పనిచేస్తానని వెల్లడించారు. రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను చూసి ఆకర్షితుడినై పార్టీలో చేరానని వివరించారు. తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే ప్రారంభమైందని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు ప్రభుత్వానికి అవసరమని అన్నారు. ఇవాళ సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో రైతు సమస్యలపై తీసుకోబోయే కీలక నిర్ణయాలపై ఆయనతో చర్చించామని తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆయన చెప్పారని, పార్టీలో ఇతర సీనియర్లలాగే శ్రీనివాస్ రెడ్డికి ప్రాధాన్యం కల్పిస్తామని, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని వెల్లడించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా, పోచారంకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పార్టీ పెద్దలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకకు చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.