ముషీరాబాద్‌కు చేరుకోగానే కేటీఆర్ కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మూసీ బాధితులను కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈవార్తలు, హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటానని కేటీఆర్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముషీరాబాద్‌లో మూసీ బాధితులను పరామర్శించేందుకు ఆయన మంగళవారం బయలుదేరి వెళ్లారు. అయితే, ముషీరాబాద్‌కు చేరుకోగానే ఆయన కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మూసీ బాధితులను కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవాలని నినదించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పేదలకు రేవంత్ నిద్రలేకుండా చేస్తున్నడు: కేటీఆర్
మూసీ ప్రక్షాళన పేరుతో హైదారాబాద్‌లోని నిరుపేదలకు సీఎం రేవంత్ నిద్రలేకుండా చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. ఏండ్లుగా ఉంటున్న తమ ఇండ్లను ఇప్పుడు ప్రభుత్వం కూలుస్తాననడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఫైర్ అయ్యారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసీరామ్ నగర్‌లో మూసీ ప్రాంత వాసులను ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో ప్రజలు బీఆర్ఎస్ కు ఓటేశారని రేవంత్ పగపెంచుకున్నాడని మండిపడ్డారు. వాళ్ల బతులకు ఆగంజేసేందుకు కంకణం కట్టుకున్నాడని దుయ్యబట్టారు. మూసీ పేరుతో దోచుకొని.. ఢిల్లీకి పైసలు పంపేందుకు పేదల జీవితాలతో రేవంత్ చలగాటమాడుతున్నాడని అన్నారు. పేదలకు కష్టం వస్తే అండగా ఉండేవాడే దేవుడని అన్నారు. తాము ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. బుల్డోజర్లను అడ్డుకుంటామని, ప్రజలకు కూడా తిరగబడాలని.. రేవంత్ కాదు.. ఆయన తాత వచ్చినా ఏమి కాదని అన్నారు.