ప్రజా పాలన.. స్వేచ్ఛాయుత పరిపాలన అంటూ తెలంగాణలో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. పది నెలల్లోనే ప్రజాగ్రహానికి గురవుతున్నది. మొన్న హైడ్రా.. నిన్న మూసీ ప్రక్షాళన.. నేడు సినీ ఇండస్ట్రీస్‌లోని హీరోయిన్లపై ఆ పార్టీ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌తో కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నది.
హైడ్రా ఎఫెక్ట్
ఈవార్తలు, హైదరాబాద్: ప్రజా పాలన.. స్వేచ్ఛాయుత పరిపాలన అంటూ తెలంగాణలో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. పది నెలల్లోనే ప్రజాగ్రహానికి గురవుతున్నది. మొన్న హైడ్రా.. నిన్న మూసీ ప్రక్షాళన.. నేడు సినీ ఇండస్ట్రీస్‌లోని హీరోయిన్లపై ఆ పార్టీ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌తో కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో 40లోపే సీట్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో జీరో సీట్లతో సైలెంట్ అయిపోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇవి మంచి మైలేజ్ నిచ్చాయి. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని, బీఆర్ఎస్సే సర్కారే బెటర్ అంటూ ప్రజలు వాపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేసీఆర్ సర్కారు తమను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదని పలువురు భావోద్వేగంతో చెప్పిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అనవసరంగా కాంగ్రెస్‌కు ఓటేశామని ఆవేదన చెందడం కనిపిస్తున్నది.
హైడ్రాపై గరం.. మూసీపై పోరు
నగరంలోని చెరువులు, కుంటల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ఆక్రమణలను కూల్చివేసేందుకు కాంగ్రెస్ సర్కారు హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని బాధ్యతలను రంగనాథ్‌కు అప్పగించింది. రెండు నెలల నుంచి నగరంలోని చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్డోజర్ చర్యలకు దిగింది. సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో మొదులకొని, ఇప్పటివరకూ చాలా కట్టడాలను నేలమట్టం చేసింది. అయితే, ఇందులో సామాన్యుల కట్టడాలు ఉండడం వివాదానికి కారణమైంది. స్థలానికి రిజిస్ట్రేషన్ అయి, జీహెచ్ ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చి, జాతీయ బ్యాంకులే లోన్లు ఇచ్చిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేయడంతో సామాన్యుడు భగ్గుమన్నాడు. ఏండ్లపాటు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకొన్న తమ ఆత్మగౌరవ సౌధాన్ని తమ కండ్లముందే కూలుస్తుంటే కొందరు అక్కడికక్కడే కన్నీళ్లతో కుప్పకూలిపోయారు. కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. అయినా.. ప్రభుత్వ కనికరించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులే కాకుండా వారి గోస చూసినా ప్రజలందరూ కాంగ్రెస్ సర్కారుపై ఫైర్ అవుతున్నారు. హైకోర్టు కూడా హైడ్రాపై కన్నెర్రజేసింది. బాధితులకు సమయం ఇవ్వకుండా నిర్మాణాలు కూలుస్తారా? అంటూ మండిపడింది. మీ బాస్‌లను సంతృప్తి పరిచేందుకు ఆదరాబాదరాగా కూల్చివేతలకు పాల్పడితే హైడ్రాను రద్దు చేస్తామంటూ తీవ్రస్థాయిలో రంగనాథ్‌పై గుస్సా అయింది. ఇదిలా ఉండగా, మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ సర్కారు మూసీ రివర్ బెడ్‌లో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ప్రారంభించింది. దీనిపైనా ప్రజలు తిరగబడ్డారు. ఏండ్లుగా అక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఓ నది ప్రక్షాళన పేరిట మా ఇండ్లను కూల్చడమేంటని మర్లపడ్డారు. బుల్డోజర్లను అడ్డుకుంటామని, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. చెప్పుకోలేని భాషలో అటు సీఎంపైనా.. ఇటు కాంగ్రెస్‌పైనా విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ సర్కారును ఇరుకునపెట్టిన కొండా కామెంట్స్
హైడ్రా, మూసీ తర్వాత అంతకంటే ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ సర్కారును కొండా సురేఖ కామెంట్స్ ఇరుకున పెట్టాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టార్గెట్‌గా ఆమె చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ, ఇటు సినీరంగాన కాకరేపాయి. నటులు నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమని, హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడని, కొందరు హీరోయిన్లు ఆయన బాధకే పెండ్లి చేసుకొని, చిత్రసీమ వదిలి వెళ్లిపోయారంటూ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఓ అడుగు ముందుకేసి బీఆర్ఎస్ హయాంలో ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ వద్దకు సమంతను వెళ్లాలంటూ నాగార్జున కుటుంబం ఫోర్స్ చేసిందని, అందుకే ఆమె విడాకులు తీసుకొని వెళ్లిపోయిందంటూ ఎవరూ రాయలేని కామెంట్స్ చేశారు. దీంతో అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ఇండస్ట్రీతోపాటు యావత్తు మహిళా లోకం కాంగ్రెస్ పార్టీపై భగ్గుమన్నది. కొండా సురేఖ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, గుట్టుగా తమ పని తాము చేసుకుంటున్నవారిని రాజకీయ కంపులోకి లాగడం ఎందుకంటూ ఫైర్ అయ్యారు. ఇవి కొండా సురేఖ వ్యాఖ్యలా? లేదా కాంగ్రెస్ సర్కారు వ్యాఖ్యలా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖను మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్‌తోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను పలువురు సోషల్‌మీడియా వేదికగా కోరారు. కాగా, ఈ మూడు ఘటనలతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఇరుకున పడింది. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చి తమకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దారితప్పి ఆ పార్టీకి ఓటేశామని, ఇకపై వేసేదే లేదని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.