లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని అధిష్ఠానం వెల్లడించింది. దాదాపు 12 వరకు సీట్లు వస్తాయని ఆశించినా.. 8 సీట్లే సాధించడం పట్ల అధినాయకత్వం గుర్రుగా ఉంది.
హైదరాబాద్, ఈవార్తలు : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని అధిష్ఠానం వెల్లడించింది. దాదాపు 12 వరకు సీట్లు వస్తాయని ఆశించినా.. 8 సీట్లే సాధించడం పట్ల అధినాయకత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లు తగ్గడానికి గల కారణాలపై ఒక కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు సీట్లు తగ్గడానికి గల నిజానిజాలను నిగ్గు తేల్చాలంటూ ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో పీజే కురియన్, రకిబుల్ హాసన్, పర్గాత్ సింగ్ ఉన్నారు. వీరు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పూర్ పెర్ఫార్మెన్స్‌పై నివేదిక తయారుచేసి అధిష్ఠానానికి అందించనున్నారు.
మరోవైపు, మరో 7 రాష్ట్రాల్లోనూ పార్టీ పూర్ పెర్ఫార్మెన్స్‌పై కమిటీలను హస్తం పార్టీ పెద్దలు నియమించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ ఫలితాలు నిరాశ కలిగించాయని కాంగ్రెస్ అధిష్ఠానం అభిప్రాయపడింది. వాస్తవానికి, తెలంగాణలో 6 నెలల కిందటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ హవాలో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 సీట్లు గెలుచుకుంటుందని అధిష్ఠానం, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా లోక్‌సభ ఫలితాలు తమ పాలనకు రెఫరెండం అని ప్రకటించారు. కానీ, తీరా ఫలితాలు చూసేసరికి కథ తారుమారైంది. నిజానికి, లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అన్నీ తానుండి నడిపించారు. ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో కీలకంగా వ్యవహరించారు. దగ్గరుండి వారి కోసం ప్రచారం చేశారు. అయినా, కాంగ్రెస్ అంత గొప్పగా గెలవలేకపోయింది.
ముఖ్యంగా సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్, కాంగ్రెస్ సిటింగ్ సీటు (రేవంత్ గెలిచిన సీటు) మల్కాజిగిరిలో ఘోర పరాభవంపై పార్టీ అధిష్ఠానం కోపంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే హస్తినకు వెళ్లిన సీఎం రేవంత్.. వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయినా, ఆయన వివరణపై సంతృప్తిగా లేకపోవడం వల్లే అధిష్ఠానం నిజనిర్ధారణ కమిటీని నియమించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.