తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..? రాజకీయం అంతా కేసీఆర్ చుట్టూనే తిరుగుతోంది. కేసీఆర్‌తో ఏపీకి ఏం సంబంధం అని అంటారా? చంద్రబాబు అంటే ఏపీనే కదా.. అందుకే ఆ మాట అనాల్సి వచ్చింది. అలా ఎందుకు? అంటే.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ కేసీఆర్ కేంద్రంగానే సాగడమే అందుకు కారణం.
రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్
తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..? రాజకీయం అంతా కేసీఆర్ చుట్టూనే తిరుగుతోంది. కేసీఆర్‌తో ఏపీకి ఏం సంబంధం అని అంటారా? చంద్రబాబు అంటే ఏపీనే కదా.. అందుకే ఆ మాట అనాల్సి వచ్చింది. అలా ఎందుకు? అంటే.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ కేసీఆర్ కేంద్రంగానే సాగడమే అందుకు కారణం. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి వద్దాం. ఫస్ట్.. కేసీఆర్ తుంటి ఎముక విరగగానే, ఆయనకు బద్ధ శత్రువులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడే ముందుగా వెళ్లి పరామర్శించారు. మేము గెలిచాం, నువ్వు పడ్డావ్.. అని వీరిద్దరు ఆయనను దెప్పి పొడవడానికే అని రాజకీయాలపై మినిమం అవగాహన ఉన్నవాళ్లు కూడా అనుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పాలనపై దునుమాడుతూ వచ్చారు. సందు దొరికినప్పుడల్లా కేసీఆర్ పాలనపై దుమ్మెత్తిపోశారు. కేసీఆర్‌కు ఓటు వేయని వాళ్లంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టు అని చూపించడానికి రేవంత్ శతవిధాలా ప్రయత్నించారు. అయితే, కరువు తాండవించి ఆయన ప్లాన్ పటాపంచలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కేసీఆర్ కూతురు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్టు చేయడం, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కారు పార్టీ రేసులో లేకుండా పోయి పార్లమెంట్ ఎన్నికల్లో ‘సున్నా’కే పరిమితమైంది.
అదే సమయంలో.. జగన్ ఓడిపోవడం, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో పరిస్థితులు మరింత రంజుగా మారాయి. మళ్లీ జగనే వచ్చి ఉంటే ఏపీ.. ఏపీలాగే, తెలంగాణ.. తెలంగాణలాగే కొనసాగేది. చంద్రబాబు రావడంతో తెలంగాణ పరిస్థితిలో మార్పు మొదలైంది. ఏపీలో రిజల్ట్స్ రాకముందే, తెలంగాణలోనూ పార్టీని విస్తరిస్తాం అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం.. రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం వరకు అంతా కామనే. కానీ, చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తారట.. అన్న మాట తెలంగాణవాదుల్లో ఒక రకమైన భయాన్ని పెంచుతోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయినా.. చంద్రబాబు శిష్యుడే అన్న ముద్ర ఉన్నది. పచ్చిగా చెప్పాలంటే ఆంధ్రాకు తొత్తు అన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది తెలంగాణవాదులకు రేవంత్ రెడ్డి సీఎం కావడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ, కేసీఆర్‌పై ఉన్న కోపం వాళ్లను సైలెంట్‌గా ఉండేలా చేసింది. ఇక.. చంద్రబాబు గురించి తెలిసిందే. అసలు తెలంగాణకు జీవితకాల విరోధి ఎవరన్నా ఉన్నారంటే.. అది చంద్రబాబే అని ప్రతీ తెలంగాణ వ్యక్తి మనోగతం. అలాంటిది చంద్రబాబు తెలంగాణకు వస్తా అంటే మళ్లీ శత్రువును రప్పించుకున్నట్లేనన్న భావన ప్రజల్లో పెరుగుతోంది.
మరోవైపు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి సీఎంల హోదాలో భేటీ అయ్యారు. వీరి భేటీల్లో తెలంగాణకు ఏదైనా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని.. చాలా మంది తెలంగాణవాదులు ఆ భేటీపై ఓ కన్నేసి ఉంచారు. అయితే, అలాంటి నిర్ణయాలు బయటికైతే తెలియలేదు. లోలోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి.. పదేళ్లు పసుపు పచ్చ జెండానే కనిపించని హైదరాబాద్.. చంద్రబాబు, రేవంత్ భేటీ సందర్భంగా పచ్చ రంగుమయమైంది. కేసీఆర్ వ్యతిరేకి అయినా.. ఆ జెండా చూసి రగిలిపోయారు తెలంగాణవాదులు. గీ రేవంత్ రెడ్డి వల్ల మళ్లీ చంద్రబాబు వస్తున్నాడు అని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరైతే సోషల్ మీడియాలో అసహనాన్ని వెలిబుచ్చారు. ఈ జెండా చూశాక కేసీఆరే ఉంటే బాగుండు..! అన్న అభిప్రాయం కలిగిందని ఓ సీనియర్ జర్నలిస్టు పోస్ట్ చేశారు. ప్రజాభవన్ (ప్రగతి భవన్) చుట్టూ టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు చూసి ఒళ్లు మండిన కాంగ్రెస్ నేతలూ ఉన్నారు. దాని పర్యవసానమే.. వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఆ జెండాలు పీకించడానికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వైఎస్ఆర్ ఫ్లెక్సీలను పెట్టించారన్న వార్తలు వినిపించాయి. భట్టి వైఎస్‌కు వీరాభిమాని మరి.. ఆ మాత్రం ఉండదా!
చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు ర్యాలీ తీయడం.. తెలంగాణలోకి వస్తున్నామని చెప్పడం.. సైబరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకోవడం జరిగాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ జనాల్లో ఆలోచనను పెంచాయి. రేవంత్‌నూ తెలంగాణ ద్రోహిగా పరిగణిస్తున్న ఓ వర్గం ప్రజలు.. వారి (రేవంత్, చంద్రబాబు) నుంచి తెలంగాణను కాపాడాలంటే కేసీఆరే రావాలి అన్న అభిప్రాయానికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అధికార దాహంతో చంద్రబాబు మళ్లీ తెలంగాణలో తన ప్రయత్నాలు మొదలుపెడితే అది కచ్చితంగా కేసీఆర్‌కే ప్లస్ అవుతుంది. ఇదే మాటను కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు. ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో.. చంద్రబాబు తెలంగాణకు వస్తే బీఆర్ఎస్‌కే లాభం అని స్పష్టం చేశారు. మొన్నటికి మొన్న విజయశాంతి కూడా అదే మాట అన్నారు. బీజేపీ పొత్తుతో టీడీపీ తెలంగాణలోకి రావడానికి ప్రయత్నిస్తే.. ఆ రెండు పార్టీలు భూ స్థాపితం అవుతాయని చెప్పారు. ఆమె ఉద్దేశం.. బీఆర్ఎస్ మళ్లీ ఎగిసిపడుతుందనే. కారు జోరు ముందు ఆ రెండు పార్టీలు నామరూపాల్లేకుండా పోతాయనే.
రేవంత్ తాను పదేళ్లు సీఎంగా కొనసాగాలన్న ఆశను బతికించుకోవాలన్నా.. కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కాపాడుకోవాలన్నా.. టీడీపీ తెలంగాణలో అడుగు పెట్టకపోవడమే మంచిది. కాదూ.. తెలంగాణకు కూడా సీఎం అవుతా.. ఓ పావును సీఎం సీట్లో కూర్చోబెట్టి తెలంగాణనూ ఆటాడిస్తా.. అని చంద్రబాబు కలలు కన్నా, చంద్రబాబుతో రేవంత్ సాన్నిహిత్యం సాగించి తెలంగాణకు ఏమాత్రం నష్టం చేసినా (ఆ తప్పిదం చేయరు).. వీరిద్దరు కలిసి కేసీఆర్ నెత్తిమీద పాలు పోసినట్లే. ఆయనకు వెయ్యి ఏనుగుల బలాన్ని్చ్చి అందలం ఎక్కించినట్లే. ఎందుకంటే.. అక్కడ ఉన్నది కేసీఆర్. తెలంగాణ వాదం చచ్చిపోయిందని అనుకున్నా, దానికి ప్రాణం పోయగల సత్తా ఇప్పటికీ కేసీఆర్‌కు ఉంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోందని ఎంత మంది అనుకున్నా.. తన పార్టీని అధికారంలో నిలబెట్టే ఏ చిన్న అవకాశం వచ్చినా రాష్ట్ర రాజకీయాలను మార్చేయగలరు. ఇప్పుడాయనకు అంత సీన్ లేదు అని అనుకుంటే మాత్రం.. వారెవరైనా పెద్ద తప్పు చేసినవారే అవుతారు.
- శివవాణి