Kazipet Coach Factory : కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ.. విభజన హామీకి కేంద్రం ఓకే

మరో విభజన హామీకి కేంద్రం ఓకే చెప్పింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి పచ్చజెండా ఊపింది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

kazipet junction
కాజీపేట జంక్షన్

హైదరాబాద్, ఈవార్తలు : మరో విభజన హామీకి కేంద్రం ఓకే చెప్పింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి పచ్చజెండా ఊపింది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న వ్యాగన్ ఫ్యాక్టరీని అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు రైల్వే బోర్డు లేఖ రాసింది. వాస్తవానికి ఏపీ విభజన చట్టం-2014లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే 2023లో వ్యాగన్ ఫ్యాక్టరీ ఇస్తామని ప్రకటన చేసింది. తాజాగా.. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే, దేశంలో ఎక్కడా కోచ్ ఫ్యాక్టరీలు అవసరమే లేదని 2017లో కేంద్రం తెలిపింది. అయితే.. 2018లో మహారాష్ట్రలోని లాతూర్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి రూ.625 కోట్లు కేటాయించింది. మహారాష్ట్రకు ఓ నీతి.. తెలంగాణకు ఓ నీతి.. ఇలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించడంతో తెలంగాణ సర్కారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. దాంతో 2023లో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. దానికి ప్రధాని మోదీ భూమిపూజ కూడా చేశారు. 2025లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పె్టుకున్నారు. దానికి రూ.521 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అయితే, ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీయే రానుండటంతో సుమారు 60 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

దక్షిణ మధ్య రైల్వే గేట్‌వేగా కాజీపేట

ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ తక్కువ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్త రైల్వే లైన్ల కోసం అనేక ప్రతిపాదనలు వెళ్లాయి. అందులో భాగంగా కాజీపేటను దక్షిణ మధ్య రైల్వేకు గేట్‌వేగా డివిజ‌న్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. వాస్తవానికి కాజీపేట, వరంగల్ స్టేషన్ల నుంచి సుమారు 200 గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. బొగ్గు రవాణా కూడా కాజీపేట మీది నుంచే జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్; సికింద్రాబాద్ రైల్వే డివిజన్లు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు పక్కపక్కనే ఉండటం గమనార్హం.

కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ 1969 నుంచే

1969 ఉద్యమ కాలం నుంచే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఉంది. ఆ కాలంలోనే ఉద్యమకారులు కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడారు. తర్వాత కాలంలో తెలంగాణకు కేటాయించిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలించారు. దాంతో నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు విభజన చట్టంలో హామీ ఇచ్చి.. తాజాగా నెరవేర్చింది కేంద్రం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్