హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్, ఈవార్తలు: హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రజల భూమికి నువ్వు కేవలం ధర్మకర్తవు మాత్రమే.. దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే కుదరదు. పచ్చని చెట్లను నరకొద్దని విద్యార్థులు నిరసనలు చేస్తుంటే, మంత్రులు వాళ్లకు దైర్యం ఇవ్వాల్సింది పోయి వాళ్ళని గుంట నక్కలు, పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరుస్తున్నారు. మూడేళ్లలో అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఈకో పార్క్ లాగా మారుస్తాం. ఆ 400 ఎకరాల భూమిలో ఎవరు ఇంచు కొనుకున్నా తిరిగి వెనక్కి తీసుకుంటాం. రేవంత్ రెడ్డి 10 నిమిషాలైన మనిషిలా పని చెయ్.. 18 గంటలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగ కాదు. ఎక్కడినుండో వచ్చిన HCU విద్యార్థులకు హైదరాబాద్ మీద ఉన్న ప్రేమలో 1% కూడా నీకు లేదా? డబ్బు కోసం ఇంత దిగజారుతావా రేవంత్ రెడ్డి? ఐటెం నెంబర్ 6 బండి సంజయ్ ఎప్పుడు తంబాకు నములుకుంటూ ఉంటే సరిపోదు.. అప్పుడప్పుడు మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులు కూడా చదవాలి’ అని చురకలు అంటించారు.
అటు.. HCU విద్యార్థులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెనక్కి తగ్గి చెట్లు కొట్టడం ఆపకపోతే హైదరాబాద్ ప్రజలతో కలిసి HCUకు మార్చ్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘ఫ్యూచర్ సిటీ కోసం 14 వేల ఎకరాలు పెట్టుకుని ఇక్కడ ప్రెసెంట్ సిటీని ఎందుకు నాశనం చేస్తున్నారు? పశ్చిమ హైదరాబాద్‌లో ఉన్న ఒకేఒక లంగ్ స్పేస్ అది.. దాన్ని ఎందుకు కరాబ్ చేస్తున్నారు. అక్కడ ఉండే జంతువులకు నోరు లేదు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులు నోర్లు ఏమయ్యాయి. దేశం మొత్తం వినపడుతుంది కానీ మీకు వినబడటం లేదా? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హరిత విప్లవాన్ని సృష్టించింది. పర్యావరణ విషయంలో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు తెలంగాణకు వచ్చాయంటే అది బీఆర్ఎస్ వల్లే. మాకు పర్యావరణం గురించి ఎవరో నీతులు చెప్పాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.