నోరు మంచిదైతే ఊరు మంచిదైతది.. కేసీఆర్ ఈ సామెత మీకు తెలియంది కాదు..

ఆనాడు తెలంగాణ తెచ్చకున్నదీ ఆత్మగౌరవం కోసమే. ఈనాడు బీఆర్ఎస్‌ను ఓడించిందీ ఆత్మగౌరవం కోసమే. ఇదే నిజం. ఉమ్మడి పాలకుల హయాంలో.. నీళ్లు ఇవ్వకున్నా బాధ అనుభవించారు. నిధులు ఇవ్వకున్నా, నియామకాలు చేపట్టకున్నా ఓర్చుకున్నారు.

kcr telangana
కేసీఆర్ తెలంగాణ

తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారం కోల్పోవటానికి కారణం ఏంటి? అభివృద్ధి చేయలేదా? ప్రజలకు సంక్షేమం అందించలేదా? పాలన సరిగా చేయలేదా? ప్రజలను గాలికి వదిలేసిందా? ప్రపంచస్థాయి పరిశ్రమలను తెలంగాణకు తీసుకురాలేదా? కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోలేదా? అంటే ఇవేవీ కావు అని తెలంగాణలోని ప్రతీ ఒక్క వ్యక్తి ఎలాంటి అనుమానం లేకుండా నిక్కచ్చిగా చెప్పగలరు. అభివృద్ధి జరిగింది వాస్తవం.. సంక్షేమ ఫలాలు ప్రజలు అందుకున్నదీ వాస్తవం. పరిశ్రమలు వచ్చింది వాస్తవం.. రియల్ ఎస్టేట్ పెరిగిందీ వాస్తవం. అయినా ఎందుకు కారు పార్టీని ప్రజలు ఇంటికి పంపించారు? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను ప్రజలు ఎందుకు దూరం కొట్టారు? అంటే.. ఆత్మగౌరవం ఒక్కటే.

ఆనాడు తెలంగాణ తెచ్చకున్నదీ ఆత్మగౌరవం కోసమే. ఈనాడు బీఆర్ఎస్‌ను ఓడించిందీ ఆత్మగౌరవం కోసమే. ఇదే నిజం. ఉమ్మడి పాలకుల హయాంలో.. నీళ్లు ఇవ్వకున్నా బాధ అనుభవించారు. నిధులు ఇవ్వకున్నా, నియామకాలు చేపట్టకున్నా ఓర్చుకున్నారు. కానీ, తెలంగాణ ప్రాంతవాసులను చిన్నచూపు చూసినందుకే ఇక్కడి ప్రజలు సహించలేకపోయారు. ఆ అనుభవం మీక్కూడా (కేసీఆర్‌కు) జరిగింది. అందుకే తెలంగాణ కోసం కొట్లాడారు.. సాధించారు. అనుకున్నట్లే తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీకి పట్టం కట్టారు. పదేండ్లు కుర్చీలో కూర్చోబెట్టారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. బీఆర్ఎస్ ఓడిపోవటానికి ప్రధాన కారణం కచ్చితంగా కేసీఆరే. ‘‘కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. కేసీఆర్ ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యారు. కేసీఆర్ ఫాంహౌజ్ నుంచే పాలిస్తున్నారు. మీడియా ప్రతినిధులను కించపరిచేలా మాట్లాడుతున్నారు. ప్రజలకు ఇష్టం లేకుండానే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. ప్రజలకు ఇష్టం లేకుండానే పంజాబ్ రైతులకు తెలంగాణ సొమ్ము పంచిపెట్టారు’’ ఇలాంటి సందర్భాలతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఇక్కడి రైతులను పట్టించుకోరు గానీ.. పంజాబ్‌కు వెళ్లి, తెలంగాణ సొమ్మును పంచిపెడతారా? అని అసహనంతో రగిలిపోయారు. తెలంగాణ ద్రోహులకు పార్టీలో పెత్తనం కట్టబెడతారా? అని కోపంతో ఊగిపోయారు. కవిత లిక్కర్ కేసు ప్రజలకు ఎక్కడలేని ఆగ్రహాన్ని తెప్పించింది. ఇక్కడి సొమ్ము ఎక్కడికో వెళ్తోందని ప్రజలు నమ్మారు.

మాకూ టైం వస్తుంది అని వెయిట్ చేశారు. ఓటుతోనే కేసీఆర్‌కు చురుకు పెడదాం అని నిర్ణయించారు. అయితే.. అభివృద్ధి చేసినందుకు ఓటు వేయాలి.. సంక్షేమ ఫలాలు అందించినందుకు అక్కున చేర్చుకోవాలన్న మంచి నిర్ణయం ప్రజల్లో ఉంది కాబట్టే కేవలం మీరు 1.8 శాతం ఓట్లతో ఓడిపోయారు. ప్రజల్లో మీరింకా గొప్ప స్థాయిలోనే ఉన్నారు అనటానికి ఇదే నిదర్శనం. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏనాడూ బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదు అన్న మాట మాట్లాడలేదు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందలేదు అని దూషించలేదు. ఆయన ఎప్పుడూ అనుకుంటూ వస్తున్న మాట.. ‘‘నిజాం మాదిరి నియంతృత్వ పాలన కొనసాగించారు’’ అని మాత్రమే. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే.. ఆ నియంతృత్వపు జాడలే బీఆర్ఎస్‌ను ఓడగొట్టాయి. 

కానీ, కాంగ్రెస్ ఇచ్చిన అలవి కానీ హామీల వల్లే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు అంటూ మీరు, మీ పార్టీ నేతలు ఇస్తున్న కామెంట్లు ప్రజల హృదయాలను గుచ్చినట్లు చేస్తున్నాయి. మీపై ఉన్న సానుభూతిని మీరే దూరం చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్ ఏదో చేస్తుంది అని కాదు.. కాంగ్రెస్ మీకన్నా గొప్పగా పాలిస్తుంది అని కాదు.. తెలంగాణ ప్రజల గుండెపై కొట్టారనే కారును దూరం చేసుకున్నారు. ‘నాకు ఓటు వేయకపోతే పోయి ఇంట్లో పడుకుంటా’ అన్న వ్యాఖ్యలు మీ అహంకారానికి నిదర్శనమని ప్రజలు భావించారు. అధికారం పోతే పోయి ఇంట్లో పడుకొంటావా? ప్రజల కోసం పోరాటం చేయవా? అని కోపగించుకున్నారు. పైగా, కొందరు పనిచేయని ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చి, వారి అకృత్యాలను పెంచి పోషిస్తానని చెప్పకనే చెప్పారనే ఉద్దేశం ప్రజల్లో నాటుకుపోయింది. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. అహంకారంతో ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారని భావించే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.

అయినా, మళ్లీ.. కాంగ్రెస్ హామీలను నమ్మి తమను దూరం చేసుకున్నారంటూ మీరు మాట్లాడటం ప్రజలకు ఇంకా కోపాన్ని తెప్పిస్తోంది. ఇలాంటి దురుసు వ్యాఖ్యలు ప్రజల హృదయాల్లో మిమ్మల్ని దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండి అల్లాడుతున్నారు. మీరు పొలంబాట పడితే ఆనందపడ్డారు. మీరు ప్రజల్లోకి వస్తున్నారంటే హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా కోసం కేసీఆర్ ఉన్నాడు అన్న భరోసాతో ఉన్నారు. అందుకే నాయకులు వెళ్లిపోయినా బీఆర్ఎస్ కార్యకర్తలు వేరే పార్టీవైపు చూడటం లేదు. ఇది మీరు గ్రహించాలి. కానీ.. ఇంకా అహంకారపు (మీ దృష్టిలో ఆ వ్యాఖ్యలు అహంకారం కాకపోవచ్చు.. కానీ ప్రజల దృష్టిలో అవే) మాటలు మాట్లాడి ప్రజలకు మరింత దూరం కావొద్దు.

- శివవాణి

వెబ్ స్టోరీస్