బీఆర్ఎస్ కార్యకర్తలతో పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తనను కలిసిన పార్టీ నేతలకు కేసీఆర్ ధైర్యం కల్పిస్తున్నారు. 25 ఏళ్ల ప్రజాప్రస్థానం ఇక్కడికే ఆగిపోలేదని, ఇంకా చాలా లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్తున్నారు.

brs chief kcr

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ తర్వాతి చర్యలు ఏంటి? అన్న సందేహం తలెత్తుతోంది. రీసెంట్‌గా ఎమ్మెల్యేల పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. వాస్తవానికి కేసీఆర్ ఓ పది రోజులు సైలెంట్‌గా ఉన్నారంటే.. ఏదో సంచలనం చేస్తారన్న వార్తలు వచ్చేవి. అలాంటిది పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం సాధారణ స్థితికి వస్తున్న ఆయన.. వరుసగా పార్టీ నేతలను కలుస్తున్నారు. దీంతో ఎర్రవెల్లి ఫాంహౌజ్ పరిసర ప్రాంతం కిక్కిరిసిపోతోంది.

అయితే, తనను కలిసిన పార్టీ నేతలకు కేసీఆర్ ధైర్యం కల్పిస్తున్నారు. 25 ఏళ్ల ప్రజాప్రస్థానం ఇక్కడికే ఆగిపోలేదని, ఇంకా చాలా లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతోందని, మళ్లీ గాడిలో పెట్టేందుకు బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ సాధించినదానికంటే సీఎం పదవి పెద్ద విషయం కాదని, బీఆర్ఎస్‌ను మళ్లీ ప్రజలు ఆదరిస్తారని వివరించారు. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం రాదని, బీఆర్ఎస్‌కు బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ను ఆదరించేదాకా ఓపిక పట్టాలని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రజల మధ్యే ఉండాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్