జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్తు కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతూ ప్రెస్ మీట్ ఎలా పెడతారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
కేసీఆర్
న్యూఢిల్లీ, ఈవార్తలు : గత పదేళ్లలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై విచారణకు నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్తు కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతూ ప్రెస్ మీట్ ఎలా పెడతారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. న్యాయం చెప్పే న్యాయమూర్తి నిష్పక్షపాతంగా ఉండాలని అన్నారు. విద్యుత్తు కమిషన్ చైర్మన్‌గా మరో జడ్జిని నియమించాలని వెల్లడించారు. సుప్రీం చీఫ్ జస్టిస్ సూచనకు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది అంగీకారం తెలిపారు. మధ్యాహ్నం తర్వాత కొత్త విద్యుత్తు కమిషన్ చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారో చెప్పాలని ఆదేశించారు. విద్యుత్తు కమిషన్ నియామకం, కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడటం, తన అభిప్రాయాలు చెప్పడం వంటి అంశాలపై కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, కొత్త జడ్జి పేరు సుప్రీంకు విన్నవించిన అనంతరం.. సుప్రీం కోర్టు అనుమతితో విచారణ కొనసాగిస్తే.. కేసీఆర్ కమిషన్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాగా, ఇప్పటికే విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విచారణకు రావాలని కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో పాత్రపై వివరణ కోరింది. దీంతో.. కేసీఆర్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. కమిషన్ చైర్మన్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయితే, కేసీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పు రావటంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.