ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితి పరిశీలిస్తే బీజేపీ అప్పర్ హ్యాండ్‌గా కనిపిస్తోంది.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి
కరీంనగర్, ఈవార్తలు: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితి పరిశీలిస్తే బీజేపీ అప్పర్ హ్యాండ్‌గా కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కోసం క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడుతుండటంతో గత 15 రోజులుగా సమీకరణాలు భారీగా మారినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంటుందని అంతా భావించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ నుంచి టికెట్ పొందారు) మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ ముగ్గురు ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనూ ఆశించిన మద్దతు కనిపించలేదు. పార్టీ అభ్యర్థి అనేకంటే.. కార్పొరేట్ కాలేజీల అధినేత అన్న పేరు ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో చాలామంది ఆయనకు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా, ఎంతో మంది పట్టభద్రులు ఆయనపై బాహాటంగానే వ్యతిరేకతను కనబర్చారు. ప్రచారంలో అన్ని చోట్ల ఆల్ఫోర్స్ కాలేజీల సిబ్బందే ఎక్కువగా కనిపించారన్న వాదనలు వినిపించాయి.
ఇక.. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రసన్న హరికృష్ణపై మొదట్లో కాస్త సానుకూలత కనిపించింది. బీసీ నినాదం ఎత్తుకోవడం, పలువురు బీసీ నేతలు ఆయనకు మద్దతు ప్రకటించడంతో గెలుపుపై ఆశలు కనిపించాయి. అయితే, అనుకున్నంత ఓటు బ్యాంకు సాధించడంలో ఆయన విఫలం అవుతున్నారన్న వాదనలు ఉన్నాయి. పలు ప్రసంగాల్లో అహాన్ని ప్రదర్శించడం, తాను గెలవకపోతే పట్టభద్రులు ఓడిపోయినట్లేనన్న విధంగా మాట్లాడటం ఆయనకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. ఒక రకంగా పట్టభద్రుల మనోభావాలపై దెబ్బ కొట్టారని, దాంతో ఆయన నుంచి పట్టభద్రులు దూరం జరిగారని ప్రచారం జరుగుతోంది. అన్నింటికన్నా ముఖ్యంగా తాను గెలిచినా కాంగ్రెస్‌లోకే వెళ్తారన్న పలు వార్తలు ఆయనకు తీవ్ర అడ్డంకిగా మారాయి. ఆయన సోషల్ మీడియా బృందం దీనికి అడ్డుకట్ట వేయడంలో దారుణంగా విఫలమైంది.
గతంలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రకటించడం, పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డిని కలవడం లాంటి సంఘటనలను ప్రజలకు తెలియజేయడంలో బీజేపీ సఫలం అయినట్లు తెలుస్తోంది. కరీంనగర్ బహిరంగ సభకు ఆశించినంత మంది రాకపోవడంతో ఆయన ఢీలా పడ్డారని దగ్గరివారే అంటున్నారు. మొత్తంగా ఈ పర్యవసానాలు హరికృష్ణ ఓటుబ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ ఓటు బ్యాంకును బీజేపీ ఒడిసి పట్టిందని విశ్లేషకులు అంటున్నారు. యువతలో సానుకూలత ఉండటం కూడా కమలం పార్టీకి కలిసి వస్తుందని పేర్కొంటున్నారు. తన గెలుపు కోసం.. అంజిరెడ్డి కంటే బీజేపీ కార్యకర్తలు, నేతలే ఎక్కువగా కష్టపడటం చూస్తుంటే.. పట్టభద్రుల ఓట్లను రాబట్టడంలో బీజేపీ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.