తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
కేసీఆర్
భూపాలపల్లి, ఈవార్తలు : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో ఆయనకు ఈ నోటీసులు ఇచ్చింది. రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ కుంగుబాటుపై గత ఏడాది అక్టోబర్ 25వ తేదీన పోలీస్ స్టేషన్‌లో, జిల్లా ఎస్పీకి, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. దీంతో తాను కోర్టును ఆశ్రయించానని పిటిషనర్ కోర్టుకు వెల్లడించారు.
అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరాం, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, కాంట్రాక్టు సంస్థ మేఘా అధినేత కృష్ణారెడ్డి, బరాజ్ నిర్మాణం చేసిన ఎల్ అండ్ టీ ప్రతినిధులే కారణమని రాజలింగమూర్తి ఆరోపించారు. దీంతో ఆ 8 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. వారంతా విచారణకు హాజరు అవుతారా? లేక వారి తరఫున లాయర్లను పంపుతారా? అన్నది చూడాల్సి ఉంది.