దేశంలోనే అరుదైన పుణ్యక్షేత్రం, సరస్వతీ అమ్మవారు కొలువైన దివ్య క్షేత్రం.. బాసర. పిల్లలకు చదువు రావాలని, గొప్ప ప్రతిభావంతులు కావాలని తల్లిదండ్రులు ఇక్కడి జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయిస్తుంటారు.
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు
బాసర, ఈవార్తలు : దేశంలోనే అరుదైన పుణ్యక్షేత్రం, సరస్వతీ అమ్మవారు కొలువైన దివ్య క్షేత్రం.. బాసర. పిల్లలకు చదువు రావాలని, గొప్ప ప్రతిభావంతులు కావాలని తల్లిదండ్రులు ఇక్కడి జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అయితే, ఇక్కడ పూజలు, అమ్మవారి విశేషాల కంటే.. అక్కడ చోటుచేసుకొనే వివాదాలే ఎక్కువ. పూజ దగ్గరి నుంచి ప్రసాదం వరకు అన్నింటా వివాదాలే. తాజాగా బీజాక్షరాల గొడవ కూడా రాజుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణం తప్ప ఆ ఊరు అభివృద్ధి చెందిందేం లేదు. నిజామాబాద్‌కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అభివృద్ధి అంతగా లేదు. అప్పట్లో ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఈ గ్రామం.. జిల్లాల పునర్విభజన తర్వాత నిర్మల్ జిల్లా పరిధిలోకి వచ్చింది. అయితే, ఇప్పటికీ అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే.
అభివృద్ధి లేకపోవడానికి, నిత్య వివాదాలకు ఊరి పేరే కారణం అని అంటున్నారు అక్కడి వేద పండితులు. బాసర అనే పేరు వల్లే వివాదాలు తలెత్తుతున్నాయని, అలా జరగకుండా ఉండాలంటే పాత పేరునే పెట్టాలని కోరుతున్నారు. దీనికోసం గ్రామస్థుల నుంచి బాసర పేరు మార్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. బాసర పేరును వాసర లేదా వ్యాసపురిగా మార్చాలని ఆలయ కమిటీ కూడా కోరుతోంది. బాసర భవిష్యత్తు బాగుండాలంటే పాత పేరు (వాసర) నే పెట్టాలని కోరుతున్నారు.
ప్రస్తుతం ఉన్న బాసర అనే పేరు నామ నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం ఒక్కటేనని.. అమ్మవారి జన్మ నక్షత్రం పేరుతోనే ఊరి పేరు ఉండటం వల్లే వివాదాలు తలెత్తుతున్నాయని వేద పండితులు చెబుతున్నారు. వివాదాలకు తెర పడాలంటే.. అక్షర దోషాన్ని తొలగించాలని, వాసరగా పిలిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని అంటున్నారు. ‘శరదిందు సమకారే.. పరబ్రహ్మ స్వరూపిణీ.. వాసర పీఠ నిలయే.. సరస్వతీ నమోస్తుతే.. ఈ శ్లోకంలోనే వాసర అని పిలిచారని, కాలక్రమంలో బాసరగా పిలుస్తున్నారని.. మళ్లీ ఆ పేరును పూర్వనామంతో పిలవాలని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి డిమాండ్లు చేస్తున్నారు.