తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి భూ కంపం వణికించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో భూకంపం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి భూ కంపం వణికించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0 గా నమోదైందని వెల్లడించారు. 3 రోజుల కిందట కూడా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజున రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, నల్లగొండ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 7 సెకండ్ల దాకా భూ ప్రకంపనలు వచ్చాయి. ఆ రోజు తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కేంద్రానికి చుట్టూ 232 కిలోమీటర్ల పరిధిలో దాని ప్రభావం కనిపించినట్టు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని వివరించారు. 2018లో తెలంగాణలో భూమి కంపించింది. 5 కన్నా అధిక తీవ్రతతో దక్షిణ భారతదేశంలో భూమి కంపించడం 55 ఏళ్ల తర్వాత అదే తొలిసారి.
భూకంపానికి కారణం అదేనా..
భూకంపాలు సంభవించే ప్రాంతాలను, వాటి తీవ్రతను జోన్-2, జోన్-3, జోన్-4, జోన్-5గా విభజించారు. జోన్-5 అంటే అత్యంత భూకంప సంభవించే ప్రాంతం అని లెక్క. అతితక్కువ తీవ్రత కలిగిన ప్రాంతం జోన్-2. ప్రస్తుతం తెలంగాణ జోన్-2లోనే ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉంది. అంటే.. ఇక్కడ భూకంపానికి అవకాశం ఏర్పడుతుంది. ఫాల్ట్ జోన్ అంటే భూమి అంతర్భాగంలో 2 బ్లాకులు ఒక దానితో ఒకటి అకాస్మాత్తుగా జారిపోయే ప్రదేశం అన్నమాట. అంతర్భాగంలో సర్దుబాటుల కారణంగా విడుదలయ్యే అపారమైన శక్తి భూకంపాలుగా ఏర్పడుతుంది. గోదావరి బేసిన్‌లో పలు చోట్ల పగుళ్లు, లోటుపాటు ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.