||సీఎం రేవంత్ రెడ్డి||
హైదరాబాద్, ఈవార్తలు ప్రతినిధి: అధికారం చేపట్టగానే తనదైన శైలిలో దూకుడు పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ కేసులన్నీ ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమ కేసులన్నీ ఎత్తివేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఉద్యమం నాటి కేసుల వివరాలను సమర్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు. 2009 నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు ఉన్న కేసులను ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి సర్కారు తమ ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రమాణం చేసిన వెంటనే రేవంత్ 6 గ్యారంటీలపై సంతకాలు చేశారు. రెండో సంతకంగా దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇచ్చారు. క్యాబినెట్ భేటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ బీమా రూ.10 లక్షలకు పెంపును అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి, అమరుల కుటుంబాలకు రూ.25 వేల పింఛను, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ హామీలిచ్చింది. ఈ హామీలను అమలు చేసే దిశగానూ రేవంత్ అడుగులు వేసే చాన్స్ ఉంది.