|| లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్న తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ||
ఈవార్తలు, తూప్రాన్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 397 మంది రైతులు, జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి, కాల్లకల్, జీడిపల్లి, కూచారం గ్రామ రైతులతో పాటు పత్రిక విలేకరులకు ఈ రోజు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రెండు సార్లు రైతుబంధు అందజేస్తున్నామని తెలిపారు. రైతుబంధు ద్వారా మొత్తం రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ఏదైనా కారణంతో రైతు చనిపోతే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమాను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నదని వివరించారు. ఇప్పటి వరకు 98 వేల రైతుల కుటుంబాలకు బీమా అందిందని చెప్పారు.
‘ఎండాకాలంలో కూడా హల్దీ వాగు చెక్ డ్యామ్‌ల నుండి మత్తడి దుంకుతోంది. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తూప్రాన్‌లో 3 మార్కెట్లు వచ్చాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వారు ఒక్క మార్కెట్ కూడా ఇవ్వలేదు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ రైతులకు రైతుబంధు వేశాం’ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
జడ్పీ చైర్ పర్సన్ హేమలత ప్రత్యేక చొరవ
రైతులు, జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందజేయడంలో జడ్పీ చైర్ పర్సన్ హేమలత ప్రత్యేక చొరవ చూపించారు. కూచారం గ్రామ రైతుల నుంచి 800 ఎకరాలను 2008లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సేకరించింది. దానికి బదులు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఇవ్వలేదు. ఈ సమస్యపై ప్రత్యేక చొరవ చూపించిన హేమలత.. మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తాజాగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందాయి. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్‌ను మంత్రి అభినందించారు.