|| జగిత్యాల ||
ఈవార్తలు, జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లా అరుదైన ఘనత సాధించింది. మరుగుదొడ్లు, బహిరంగ మల మూత్రవిసర్జన రహితం, ఇంకుడు గుంతల నిర్మాణం తదితరాల్లో ఉత్తమంగా పని చేసినందుకు కేంద్ర ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. 2023లో స్వచ్ఛ సర్వేక్షణ్ త్రీ స్టార్ కేటగిరీలో జగిత్యాల జిల్లాకు జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల పరిధిలోని 495 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడ, బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దడం, తడి, పొడిచెత్త వేరు చేసి కంపోస్ట్ షెడ్లతో ఎరువుల తయారీ తదితర అంశాలపై కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించి వివరాలు సేకరించాయి.
ఈ వివరాలను పరిశీలించగా దేశంలోనే రెండో స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది. జిల్లాకు జాతీయ అవార్డు రావడం పట్ల జిల్లా యంత్రాంగం సంతోషం వ్యక్తం చేసింది. డీఆర్డీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. లోపాలను సరిచేసుకొని, గ్రామాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. జిల్లాకు 5 స్టార్ వచ్చేలా మరింత కృషి చేసేందుకు ఈ అవార్డు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.