||మాజీ డీజీపీ అంజనీకుమర్||
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో రాజీనామాలు, బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేయగా, ప్రభుత్వం అధికారుల బదిలీ కార్యక్రమాలు చేపట్టింది. ముందుగా ఐపీఎస్‌ల బదిలీలపై నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. సైబరాబాద్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి, రాచకొండ కమిషనర్‌గా సుధీర్ బాబు, యాంటినార్కొటిక్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. సైబరాబాద్, రాచకొండ సీపీలుగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, మాజీ డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో డీజీపీగా ఉన్న అంజనీకుమార్.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనను ఈసీ సస్పెండ్ చేసింది. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చిన ఆయన.. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని, మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చారు. ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని వివరించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేసి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.